ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
సీఐటీయూ జిల్లా సంయుక్త కార్యదర్శి కృష్ణమాచారి
బెజ్జూర్,(విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని గ్రామపంచాయతీ ఆవరణలో కరపత్రాలు విడుదల చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో 2026 ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న "జైల్ భరో" కార్యక్రమాన్ని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సంయుక్త కార్యదర్శి వెలిశాల క్రిష్ణమాచారి పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల, కార్మిక–రైతు–ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తూ దేశ సంపదను ప్రైవేటీకరణ చేస్తున్నదని ఆయన విమర్శించారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా సాధించిన దేశ స్వాతంత్ర్య స్ఫూర్తిని కాపాడుకోవాలంటే నేటి పరిస్థితుల్లో ప్రజలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను హరిస్తాయని, ఉద్యోగ భద్రతను దెబ్బతీసి "హైర్ అండ్ ఫైర్" విధానానికి చట్టబద్ధత కల్పిస్తున్నాయని తెలిపారు. ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు పెంచే అవకాశాలు కల్పించడం, సమ్మె హక్కుపై ఆంక్షలు విధించడం, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా హక్కులను బలహీనపరచడం కార్మిక వర్గంపై తీవ్రమైన దాడి అని పేర్కొన్నారు.
రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా తీవ్రంగా నష్టపరుస్తున్నాయని అన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో దిగుమతులను పెంచి దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలను దెబ్బతీస్తున్నారని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వకుండా రైతులను సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధరలు, ప్రకృతి వైపరీత్య నష్టపరిహారం, పంట బీమా వంటి అంశాలపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచకుండా బలహీనపరచడం, అంత్యోదయ ఆహార భద్రతా పథకంలో కోతలు విధించే ప్రయత్నాలు చేయడం పేదలపై భారంగా మారుతాయని తెలిపారు. అలాగే విద్యుత్ సవరణల ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నాలను ప్రజలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజల హక్కులు, కార్మికుల హక్కులు, రైతుల ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఆగస్టు 10న నిర్వహించే "జైల్ భరో" కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో తదితరులు విజయవంతం చేయాలని వెలిశాల క్రిష్ణమాచారి కోరారు.






