ఈ గోస తీరేదెన్నడు?
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో కొనుగోలు కేంద్రం వద్ద మక్కల ట్రాక్టర్ల బారులు
మహబూబాబాద్, మే 16 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను విక్రయించుకోవడానికి అన్నదాతలు పడుతున్న గోస తీరేదెన్నడని ఆవేదన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి మండలాల పరిధిలో కేసముద్రం, ధనసరి సొసైటీల ద్వారా మార్క్‌ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 31 నుంచి మక్కల కొనుగోళ్లను చేపట్టింది.
ఇప్పటివరకు ఈ రెండు సొసైటీల ద్వారా 3.50 లక్షల బస్తాల మక్కలను కొనగా, వాటిలో 2 లక్షల బస్తాల వరకు పెద్దపల్లి గోదాముకు తరలించగా, 1.50 లక్షల బస్తాల మక్కలను కొద్దిరోజులుగా కేసముద్రం మార్కెట్ యార్డులో నిలువ చేస్తున్నారు. ఇందుకోసం నెలన్నర కాలంగా రైతులు ట్రాక్టర్లతో కేసముద్రంలో బారులు తీరడం నిత్యకృత్యంగా మారింది.
కేసముద్రం పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గత కొద్ది రోజులుగా మక్కల లోడుతో మార్కెట్‌కు వచ్చిన ట్రాక్టర్లతో నిరీక్షించడం నిత్య కృత్యంగా మారింది. ఈ క్రమంలో ఇంకా లక్షన్నరకుపైగా బస్తాలు రైతుల నుంచి సేకరించాల్సి ఉందని అధికారులు చెపుతున్నారు. అయితే మొక్కజొన్న పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు, ఎంత దిగుబడి వచ్చింది, అందులో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం పండిన పంట ఎంత అనేదానిపై స్పష్టమైన వివరాలు లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.






