7 August, 2026 | 7:55 PM

కుష్టు వ్యాధిపై అపోహలు వీడాలి

07-08-2026 06:48 PM

బేల: కుష్టు వ్యాధిపై ప్రజలందరూ అపోహలు వీడాలని, కుష్టు రహిత భారత దేశ నిర్మాణానికి అందరూ కలిసి రావాలని డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వామన్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పొనాల గ్రామంలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కోసం ఆశా కార్యకర్తలచే ఇంటింటి సర్వేను నిర్వహించారు. సర్వేను పరిశీలించిన అనంతరం గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో పొనాల గ్రామం నుంచి ఇద్దరికీ కుష్టు వ్యాధి నిర్ధారణ కావడంతో ప్రత్యేక సర్వేను నిర్వహించినట్లు తెలిపారు.

శరీరంపై పాలి పోయిన రాగి రంగు గల మొద్దు బారిన మచ్చలు, కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. కుష్టు వ్యాధి ఏ దశలోనైనా నయమవుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కుష్టు వ్యాధికి ఎండిటీ చికిత్స లభిస్తుందని తెలిపారు. సర్వేలో భాగంగా ఒకరిని గుర్తించి చికిత్స ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఛత్రుఘన్,డి పి ఎం ఓ రమేష్,పంచాయతీ కార్యదర్శి నరేష్,సూపర్వైజర్ అనసూయ, ఎం ఎల్ హెచ్ పి దీక్ష, ఏ ఎన్ ఎం లు లక్ష్మీ, రూపాలి, ఆశా కార్యకర్తలు సౌజన్య, బబిత, దుర్గ, లక్ష్మి, వైశాలి, అనురాధ లు పాల్గొన్నారు.