తల్లిదండ్రులు లేరని ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఏడో వార్డులో ఘటన
సదాశివపేట, మే 2( విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఏడో వార్డులో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు లేరనే మనస్తాపంతో మధు(17) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గత వారం రోజు ల క్రితం సిద్దాపూర్ కాలనీలో అనుమానం నేపథ్యంలో భార్యను చంపి భర్త ఉరేసుకున్న విషయం తెలిసిందే.
మృతుల కుమారుడైన మధు తల్లిదండ్రులు లేకపోవడంతో ఒంటరిగా తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలిసింది. ఈ క్రమంలో మనస్థాపంతోనే శనివారం సదాశివపేట పట్టణంలోని తేజ వెంచర్‌లో చెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమం దించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






