calender_icon.png 19 February, 2026 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాత్ర ముగించుకుని వస్తుండగా విషాదం

19-02-2026 12:09:53 AM

షాద్‌నగర్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని సంతోషంగా ఇంటికి తిరిగివస్తున్న ఆ కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీరని శోకాన్ని నింపింది. షాద్నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజాల్ ప్రాంతానికి చెందిన పురుషోత్తం రెడ్డి (బ్రిలియంట్ స్కూల్ యజమాని), మధుసూదన్ రెడ్డి మరికొందరితో కలిసి అరుణాచలం శివయ్య దర్శనానికి వెళ్లారు. యాత్ర ముగించుకుని ఇన్నోవా వాహనంలో తిరిగి హైదరాబాద్ వస్తుండగా, రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో ఒక గుర్తుతెలియని వాహనం వీరి కారును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాద ధాటికి కారు తీవ్రంగా దెబ్బతినగా ప్రమాదంలో పురుషోత్తం రెడ్డి (బ్రిలియంట్ స్కూల్), మధుసూదన్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే షాద్నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమై పరారీలో ఉన్న వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.