11 July, 2026 | 2:45 AM

మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేయాలి

11-07-2026 01:46 AM

రేగా కాంతారావు

అశ్వాపురం, జూలై 10, (విజయక్రాంతి): అశ్వాపురం మండల పరిధిలోని బీజీ కొత్తూరు పంప్హౌస్ సమీపంలో నిర్మాణంలో ఉన్న మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మొండికుంట సర్పంచ్ మర్రి సంధ్య, మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం రేగా కాంతారావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ఎత్తిపోతల పథకం సహా పలు ప్రతిష్ఠాత్మక సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించారని గుర్తుచేశారు.

మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి స్థానిక రైతులకు త్వరితగతిన సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాలు సాగులోకి వచ్చి రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పంప్హౌస్ నుంచి ఎగువ ప్రాంతాలకు నీటి విడుదల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రేగా కాంతారావు, బీఆర్‌ఎస్ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.