27 June, 2026 | 9:55 PM

గచ్చిబౌలిలో ట్రాఫిక్ సమస్యలకు ఊరట

27-06-2026 08:46 PM

- వన్-వే లింక్ రోడ్డు ఏర్పాటుకు అధికారుల సన్నాహాలు

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): గచ్చిబౌలి ప్రాంతంలో రోజువారీ ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్న స్థానికులకు ఊరట కలిగించేలా కొత్త వన్-వే లింక్ రోడ్డు నిర్మాణానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈమార్ ప్రాపర్టీస్ సమీపంలోని బ్రహ్మకుమారీస్ మీదుగా గోపీచంద్ అకాడమీ నుండి ఇందిరానగర్ వరకు కొత్త లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై అధికారులు శనివారం సంయుక్త తనిఖీలు చేపట్టారు.

తెలంగాణ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసు అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ లింక్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ కొత్త రోడ్డు నిర్మాణం పూర్తయితే గచ్చిబౌలి-మాధాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అధికారులు త్వరలోనే ఈ ప్రతిపాదనను అమలు చేయాలని వారు కోరుతున్నారు.త్వరలో ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టనునట్లు అధికారులు తెలియజేశారు.