తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన టీపీటీఎఫ్ నేతలు
ఆసిఫాబాద్(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) రాష్ట్ర కార్యదర్శి ఆత్రం భుజంగ్ రావు, జిల్లా కార్యదర్శి కనక వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద ఉపాధ్యాయులు మాడవి మాణిక్ రావు, తెలంగాణ ఉద్యమ ఏజేసీ కన్వీనర్ కొండ్ర రాజేశ్వర్, విద్యార్థులు సాయుధ, శేఖర్, వినోద్ తదితరులతో కలిసి పుష్పాంజలి ఘటించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడిన టీపీటీఎఫ్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి స్వర్ణ తెలంగాణగా ఎదగాలని ఆకాంక్షించారు. అమరవీరుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.






