సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు
డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనను, కొత్తగూడ-కొఠారి గ్రామంలో నిర్వహించిన సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని, రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుల ప్రారంభోత్సవాన్ని, భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత, వివిధ సంఘాల ప్రతినిధులు, అధికార యంత్రాంగం సమిష్టిగా కృషి చేశారని పేర్కొన్నారు.
భారీ సంఖ్యలో సభకు హాజరై ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు తెలిపిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధి, పేదల సంక్షేమం, గృహరహిత కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలు చూపిన ఆదరణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.ఆసిఫాబాద్ జిల్లాపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆత్రం సుగుణక్క స్పష్టం చేశారు.






