19 May, 2026 | 2:45 PM

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యం

19-05-2026 12:00 AM

కలెక్టర్ స్నేహ శబరీష్

మహబూబాబాద్, మే 18 (విజయక్రాంతి): ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను ప్రథమ ప్రాధాన్యంగా గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ కే. అనిల్ కుమార్తో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల సమస్యలను నిష్పక్షపాతంగా, నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించడమే అధికారుల మొదటి ప్రాధాన్యత కావాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.

ప్రజావాణి కార్యక్రమంలో మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని కంబాలచెరువును ఓ వ్యక్తి రాత్రికి రాత్రి ట్రాక్టర్లతో మట్టి తెచ్చి పూడ్చి వేసి ఆక్రమణకు పాల్పడుతున్నారని మత్స్య కార్మిక సంఘం నాయకులు సింగని అశోక్, దేశ బోయిన రాధాకృష్ణ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై సర్వే నిర్వహించి చెరువుకు ఎఫ్టిఎల్ హద్దులు నిర్ణయించి మత్స్య కార్మికుల జీవనోపాధికి భంగం కలగకుండా చూడాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.

అలాగే  ధరణి సమస్యలు, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, భూ వివాదాలు, స్థానిక సమస్యలపై జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 132 దరఖాస్తులు ఇచ్చారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మక్క జొన్న, ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో రైతులను డబ్బులు వసూలు చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గత రెండు మూడు రోజుల నుండి రికార్డు స్థాయిలలో కొనుగోలు తరలింపు జరుగుతుందని మరింత అంకితభావంతో పనిచేసే రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో (హౌసింగ్ పీడీ) పురుషోత్తం, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, అన్ని విభాగాల అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, డివిజన్ కార్యాలయాలలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.