12 April, 2026 | 5:02 PM

ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన శ్రీపాద

12-04-2026 03:14 PM

శ్రీపాద ఆశయ సాధనలో తనయుల ప్రయాణం

రేపు శ్రీపాదరావు 27వ వర్ధంతి

మంథని,(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దివంగత శాసనసభాధిపతి దుద్దిళ్ళ శ్రీపాదరావు ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన వ్యక్తిత్వమే ఆయనను ప్రజలకు దగ్గర చేసింది. ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా చేసింది. శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా మనందరం ఆయన సేవలను గుర్తుచేసుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు భూపాలపల్లిలో 13 ఏప్రిల్ 1999 న ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా మహాదేవపూర్ మండలం అన్నారం గ్రామ సమీపంలో ఆయనను నక్సలైట్లు అకారణంగా హతమార్చడం యావత్ రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొందరు నాయకులు పదవుల వల్ల కాదు, తమ వ్యక్తిత్వం వల్ల గుర్తుండిపోతారు.

వారు అందించిన విలువల వెలుగులు మాత్రం చిరస్థాయిగా నిలుస్థాయి. తెలుగు నేలపై అలాంటి వెలుగులు పంచిన నాయకుడు స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు. మార్చి 2, 1935న కాటారం మండలం ధన్వాడ గ్రామంలో జన్మించిన ఆయన సర్పంచ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి వరకు ఎదిగారు. న్యాయవాదిగానూ సేవలందించారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీపాదరావు బాల్యమంతా పల్లెటూరులోనే గడిపారు. తల్లిదండ్రులు రాధాకృష్ణయ్య, కమలాబాయి విలువలతో కూడిన పెంపకం ఆయన ప్రజా ప్రస్థానానికి పునాదిరాళ్లయ్యాయి. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఆయన ధన్వాడలో ప్రాథమిక విద్య, మంథనిలో ఎస్‌ఎస్‌సీ పూర్తి చేశారు.

ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ ఆ తర్వాత ఆదిలాబాద్‌లో పంచాయతీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. పంచాయతీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు గ్రామ పరిపాలనపై స్పష్టమైన అవగాహన ఇచ్చింది. అనంతరం నాగ్‌పూర్‌లో న్యాయశాస్త్రం చదివి న్యాయవాదిగా సేవలందించారు. వ్యవసాయం చేస్తూ రాజకీయాల్లోకి తండ్రి మరణం తర్వాత శ్రీపాదరావు తన స్వగ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయం చేశారు. ఆ వ్యవసాయమే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. రైతు కష్టాలు, పల్లె ప్రజల ఆవేదనలు ఆయనకు ప్రత్యక్ష అనుభవాలయ్యాయి. రాజకీయాల్లోకి రావడానికి ఆయనకు పెద్ద వేదికలు అవసరం కాలేదు. ప్రజలే ఆయనను ముందుకు నడిపించారు. వరుసగా రెండు సార్లు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై, మహదేవపూర్ సమితి అధ్యక్షుడిగా, మంథని ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ ఛైర్మన్‌గా పనిచేశారు.

ఈ దశలోనే ఆయన ప్రజానాయకుడిగా ఒక్కో మెట్టు పైకెదిగారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు దూరమయ్యే రాజకీయ సంస్కృతికి భిన్నంగా, ఆయన ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండేవారు. నాయకత్వం అంటే హోదా కాదని, బాధ్యత అని ఆయన చెప్పేవారు. 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం మధ్య కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రజల విశ్వాసం ఆయనకు రాజకీయ బలాన్ని ఇచ్చింది. మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై, మంథని నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేశారు. రహదారులు, సాగునీటి సదుపాయాలు, విద్యా సంస్థలు, సంక్షేమ పథకాలు ఇలా ఆయన రాకతో మంథని రూపురేఖలు మారిపోయాయి. 1990-94 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయనకు లభించిన అత్యున్నత గౌరవం.

స్పీకర్ పదవి అంటే కేవలం సభను నడపడం కాదు అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చేవారు. అది ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత. పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉన్న కాలంలో కూడా ఆయన నిష్పక్షపాత వైఖరి పాటించారు. పార్టీ భావజాలాన్ని పక్కన పెట్టి, సభను సమతుల్యంగా నడిపి, అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల ప్రశంసలు పొందారు. శ్రీపాదరావు స్పీకర్‌గా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యులు క్రమశిక్షణగా మెలిగేవారు. ప్రజలకు ఉపయోగపడే చర్చలన్నీ గౌరవప్రదంగా జరిగేలా చూసేవారు శ్రీపాద. సభాపతి పీఠం పట్ల ప్రజల్లో ఉన్న గౌరవాన్ని నిలబెట్టారు. అలాగే తన నియోజకవర్గాన్ని మరువలేదు. మంథని అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

నక్సలైట్ల చేతిలో 1994 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజాసేవలో మాత్రం శ్రీపాదరావు వెనకడుగు వేయలేదు. నక్సలిజం ప్రభావం ఉన్న ప్రాంతంలోనూ ప్రజల మధ్యే తిరిగేవారు. హింసకు బదులుగా ప్రజాస్వామ్య మార్గాన్ని విశ్వసించారు. ప్రజల కోసం జీవించిన నాయకుడి జీవితం ఇలా బలవడం తెలంగాణ రాజకీయ చరిత్రలో విషాదం నింపింది. శ్రీపాద మరణానంతరం అవే విలువలతో రాజకీయాల్లో శ్రీధర్ బాబు తండ్రి ఆశయ సాధనకు త్రికరణ శుద్ధితో ప్రజా సేవలో ముందుకు వెళుతున్నారు.

తండ్రి స్ఫూర్తితో ఆయన కుమారులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు,  శ్రీనుబాబులు ముందుకు తీసుకెళ్తున్నారు. 1999 నుంచి శ్రీధర్ బాబు వరుసగా ఐదుసార్లు మంథని ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్నారు. నేటి రాజకీయ వాతావరణంలో విభజన, విమర్శలు, ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న వేళ, శ్రీపాదరావు జీవితం ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. అధికారాన్ని సంపాదించడం సులభమే కానీ, విశ్వాసాన్ని సంపాదించడం కష్టమని గ్రహించిన శ్రీధర్ బాబు తనపై కొందరు కావాలని పని కట్టుకొని చేస్తున్న విమర్శలపై ఏనాడు ఘాటుగా స్పందించక పోవడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.