ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
– ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు
ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించే దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా విని, దరఖాస్తులను స్వీకరించారు.
ఉట్నూర్ మండలం హీరాపూర్ జెండాగూడ గ్రామానికి చెందిన సుభద్రాబాయి తన కుమార్తె ప్రసవానంతరం మృతి చెందగా, శిశువు తండ్రి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆ చిన్నారి పోషణ కోసం ఆర్థిక సహాయం అందించాలని వినతిపత్రం సమర్పించారు. నేరడిగొండ మండలం రాజూరా గ్రామానికి చెందిన కైలాష్ ప్రమాదవశాత్తు తన ఎడ్ల జత మృతి చెందిందని, జీవనోపాధి కోసం కొత్త ఎడ్ల జత మంజూరు చేయాలని కోరారు. కేరమెరి మండలం నిషాని గ్రామానికి చెందిన మాడవి మనోహర్ తమ గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇప్పటివరకు ప్రారంభించలేదని, వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఉట్నూర్ మండలం కొమ్ముగూడ గ్రామానికి చెందిన ఆర్తి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు సమర్పించారు. నార్నూర్ మండలం ఎంపల్లి గ్రామానికి చెందిన బాబూలాల్ బోర్‌వెల్ మంజూరు చేయాలని కోరగా, బాలనపూర్ గ్రామానికి చెందిన మాడవి అనీష్ వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్ కోచింగ్ పొందేందుకు ఆర్థిక సహాయం అందించాలని వినతిపత్రం సమర్పించారు.
అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయం, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు అందజేశారు. అందిన ప్రతి వినతిపత్రాన్ని సంబంధిత శాఖల అధికారులు సకాలంలో పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రాజెక్టు అధికారి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






