22 March, 2026 | 9:46 AM

ధురంధర్‌పై టాలీవుడ్ స్టార్ ప్రశంసలు

22-03-2026 12:00 AM

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టిస్తోంది. ఉగాది కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, రామ్‌చరణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌గోపాల్‌వర్మ వంటి టాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించగా, తాజాగా దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రంపై తన రివ్యూను పంచుకున్నారు.

“ధురంధర్: ది రివెంజ్’లో ఎమోషన్స్ ఏమాత్రం తగ్గలేదు. నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ, ప్రేక్షకులను ఒక్క క్షణం కూడా పక్కకు తిప్పుకోనివ్వకుండా ఆదిత్యధర్ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాడు. ఇలాంటి సాహసోపేతమైన చిత్రాన్ని తెరకెక్కించడానికి ఎంతో గట్స్ ఉండాలి. రెండు భిన్నమైన పాత్రల్లో రణ్‌వీర్ పరకాయ ప్రవేశం చేశారు. షెడ్డులో బంధించిన సోదరిని కలిసే సన్నివేశంలో రణ్‌వీర్ ప్రదర్శించిన హావభావాలు ‘మాస్టర్ క్లాస్’. మాధవన్ నటన దేశ నిస్సహాయతను ప్రతిబింబించేలా ఉంది.

ఈ విజయం చిత్రబృందానికే కాకుండా భారతీయ సినిమాకు గర్వకారణం” అంటూ రాజమౌళి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక ఇదే సినిమా గురించి ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా స్పందించారు. ఈ చిత్రాన్ని మెచ్చుకున్న సౌత్ స్టార్స్‌కు ‘అబ్లిగేషన్’ అనే ట్యాగ్ వేశారు. అంటే, వాళ్లంతా మనస్ఫూర్తిగా కాకుండా ఏదో ఒక రాజకీయ, ఇతర ఒత్తిళ్ల వల్ల సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారంటూ పరోక్షంగా ఆరోపించారు. ‘నేను ఈ ధురంధర్‌కు చాలా దూరంగా ఉన్నాను’ అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.