26 February, 2026 | 11:47 AM

సిరికొండ, కమ్మర్‌పల్లి అటవీ ప్రాంతాల్లో పులి కదలికలు

26-02-2026 12:28 AM

అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు

సిరికొండ, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా సిరికొండ, కమ్మార్ పల్లి అటవీ రేంజ్ పరిధిలో పులి సంచారం నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా (నిజామాబాద్), ఆర్మూర్ అటవీ విభాగాధికారి బి. భవాని శంకర్ క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు.

గతంలో జూలై 2025లో పులి కనిపించిన ప్రాంతాలను అధికారులు సవివరంగా పరిశీలించి అటవీ సిబ్బందికి పలు మార్గదర్శకాలు జారీ చేశారు.అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య మాత్రమే గుంపులుగా అడవికి వెళ్లాలని తెలిపారు.

పశువులు, మేకలు, గొర్రెలను అడవికి దూరంగా మేపుకోవాలని, రాత్రి సమయంలో ఇంటి వద్దనే కట్టివేసి సంరక్షించుకోవాలని కోరారు. పులి ఆనవాళ్లు గమనించినా లేదా కదలికలపై సమాచారం తెలిసినా వెంటనే సంబంధిత అటవీ అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. పులి సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రజలు తమవంతు సహకారం అందించాలని అధికారులు కోరారు. ఈ తనిఖీలలో సిరికొండ, కమ్మార్పల్లి రేంజ్ అటవీ అధికారులు, సిరికొండ రేంజ్ సిబ్బంది పాల్గొన్నారు.