వరదల నివారణ చర్యలపై ప్రణాళికతో ముందుకు వెళ్లాలి
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ మే 7 (విజయ క్రాంతి): రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరదల నివారణ, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గురువారం వివిధ శాఖల జిల్లా అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వర్షాకాలానికి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలు, వరదల సమయంలో తక్షణ స్పందన, ప్రజల రక్షణ, సహాయక చర్యలు, అత్యవసర సేవల సమన్వయంపై విస్తృతంగా సమీక్షించారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాలు, చెరువులు, వాగులు, కాలువలు, రహదారుల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
వర్షాకాల సన్నద్ధతలో భాగంగా నిర్మల్ జిల్లాలో జిల్లా స్థాయి ఫ్లడ్ మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మాక్ ఎక్సర్‌సైజ్ ద్వారా వరదల సమయంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను ప్రాయోగికంగా అమలు చేసి శాఖల మధ్య సమన్వయాన్ని పరీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్ పరిపాలన, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా శాఖలతో పాటు ఇతర అత్యవసర సేవల విభాగాలు పాల్గొంటాయని తెలిపారు. ప్రజల తరలింపు ప్రక్రియ, సహాయక శిబిరాల ఏర్పాటు, రక్షణ చర్యలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందన విధానాలను సమగ్రంగా పరిశీలించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలోఅదనపు కలెక్టర్లు బి వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆర్ డి ఓ రత్న కళ్యాణి, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






