ఓటరు జాబితాపై ఇదే చివరి అవకాశం.. ఇక తప్పుకు తావులేదు
రామాయంపేట ఆగస్టు 27 (విజయక్రాంతి): ఓటు హక్కు మీది.. బాధ్యత కూడా మీదే! ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఓటర్లకు తహసీల్దార్ రజనీకుమారి కీలక హెచ్చరిక చేశారు. ఓటరు జాబితాలో పేరు లేకపోయినా.. నోటీసులు అందినా.. రెండు చోట్ల ఓటు ఉన్నా.. ఇక నిర్లక్ష్యం చేస్తే హక్కు కోల్పోయే పరిస్థితి ఎదురుకానుంది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడే ఆధారాలు సమర్పించుకోవాలని, తప్పులు ఉంటే సరిచేసుకోవాలని ఆమె సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని తహసీల్దార్ రజనీకుమారి తెలిపారు. ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిప్లై ఇవ్వాలని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే అర్హతను నిరూపించే ఆధారాలను సమర్పించాలని సూచించారు.
అదేవిధంగా ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నట్లయితే ఒకచోట ఓటును తప్పనిసరిగా రద్దు చేసుకోవాలని తెలిపారు. ఓటరు పేరు, చిరునామా, ఇతర వివరాల్లో మార్పులు లేదా చేర్పులు అవసరమైతే ఇప్పుడే సవరించుకోవాలని సూచించారు. అక్టోబర్ 19, 2026 నాటికి తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని తహసీల్దార్ రజనీకుమారి వెల్లడించారు. ఆ తర్వాత ఓటరు జాబితాలో మార్పులు, సవరణలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
‘ఇప్పుడే స్పందించండి.. లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది’ అన్న రీతిలో అధికారులు చేస్తున్న ఈ హెచ్చరికతో ఓటర్లు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకం కావడంతో, జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఓటరూ మరోసారి నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ మొత్తం రామాయంపేట మండలం లో ఓటర్లు 30210 ఉండగా అందులో పురుషుల ఓటర్లు 14454 ఉన్నాయి. మహిళా ఓటర్లు 15756 ఉన్నారు. మండలంలో సర్పక్రియ పూర్తయింది. 9,000 మందిని అనర్హులుగా గుర్తించారు. 9000 మందికి నోటీసులు ఇచ్చాం.






