విద్యార్థుల భవిష్యత్తు విజయాలకు బాటలు వేస్తాయి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, జూన్ 14 (విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్ విజయాలకు ఫౌండేషన్ కోర్సులు బాటలు వేస్తాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఆదివారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, డీఈఓ సందీప్ కుమార్ ఝా ఫౌండేషన్ కోర్సులపై ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ లు, ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోటీ పరీక్షల శిక్షణను అందించి, భవిష్యత్తులో జాతీయ స్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా చేయడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తం గా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), పీఎం శ్రీ పాఠశాలలు, మోడల్ పాఠశాలల్లో ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఎనిమిదో, తొమ్మిదో, పదో తరగతుల విద్యార్థులకు జేఈఈ, నీట్, క్లాట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై ప్రారంభ దశ నుంచే అవగాహన కల్పించి, వారికి అవసరమైన విద్యా పునాదులను బలోపేతం చేయడం కోసం ప్రత్యేకంగా ప్రత్యక్ష ఆన్లైన్ తరగతులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. రేపటి నుంచి ఈ తరగతులు అన్ని ఎంపిక చేసిన 28 పాఠశాలల్లో ప్రారంభం కానున్నాయని చెప్పారు.
విద్యార్థులు ఇంటర్మీడియట్ అనంతరం జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయాలు సాధించి, దేశంలోని ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పొందేందుకు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను ఈ ఫౌండేషన్ కోర్సుల ద్వారా అందించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.అన్‌అకాడమీ నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ తరగతుల్లో విద్యార్థులు తమ సందేహాలను నేరుగా నివృత్తి చేసుకునే అవకాశం కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన పోటీ పరీక్షల శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
అన్ని కేజీబీవీలు, పీఎం శ్రీ, మోడల్ పాఠశాలల్లో ప్రతిరోజూ నిర్ణీత సమయానికి అన్‌అకాడమీ తరగతులు తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక కాలపట్టిక రూపొందించడంతో పాటు, తరగతుల హాజరు, బోధించిన అంశాలు, విద్యార్థులు పాల్గొనడం వంటి వివరాలను నమోదు చేసే విధంగా ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. అదే విధంగా ప్రతి వారాంతంలో కార్యక్రమ పురోగతిని సమీక్షించి, అవసరమైన సూచనలు అందించాలని సూచించారు.
విద్యార్థులలో పోటీ పరీక్షల పట్ల ఆసక్తి పెంపొందించడం, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునేలా ప్రోత్సహించడం, భవిష్యత్తులో మెరుగైన విద్యా అవకాశాలను అందిపుచ్చుకునేలా మార్గనిర్దేశం చేయడం ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమవుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం, ఆన్ అకాడమీ ప్రతినిధులు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.






