ఓట్లు కొల్లగొడుతున్నరు!
- ‘సర్’ ప్రయత్నాన్ని అడ్డుకుందాం
- బీహార్, బెంగాల్ తరహాలో ఇక్కడా ప్రమాదం
- ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం, జూన్ 24 (విజయక్రాంతి): సర్ పేరుతో ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డు కోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పాలనంటే నలుగురి కోసం చేసేది కాదని నాలుగు కోట్ల మంది ప్రజల కోసం చేసేది పరిపాలన అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వ నేతృత్వంలో ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు, బీఎల్‌ఏలు, ప్రజ లు అప్రమత్తతతో వ్యవహరించాలని చెప్పా రు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా నమోదు, సవరణలు, మ్యా పింగ్ ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాయకుల అభిమానులు కార్యకర్తల వివరాలను సేకరించి ప్రతి ఒక్క ఓటును సరిచూసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థ (సాఫ్ట్వేర్/ డేటా మేనేజ్మెంట్) పని చేస్తోందని తెలిపా రు. ఈ ప్రక్రియ ద్వారా గ్రామాలు, వార్డుల వారీగా ఉన్న ఓటర్ల పూర్తి వివరాలను సేకరించి, వారి ఓట్లు తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని ఆరోపించారు. బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి వ్యవస్థల ద్వారా ఓటర్ల వివరాలను పక్కాగా క్రోడీకరించడం జరిగిందన్నారు.
ఒక్కో నియోజకవర్గంలో 30 నుంచి 40 వేల ఓట్ల ను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా తొలగించడంతో అభ్యర్థుల గెలుపోటములు తారుమారాయని చెప్పారు. రాష్ట్రంలో ఆ పరిస్థితి రాకుండా కాంగ్రెస్ అభ్యర్థులు, స్థాని క నాయకులు చూడాలని సూచించారు. ముఖ్యంగా అన్‌మ్యాపింగ్ జాబితా ఓటర్ల వివరాలను సేకరించి, వారికి ఓటు హక్కు కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఏ ఒక్క అర్హుడైన ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చూడటమే మన లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే బీఎల్‌ఓలు ఏమాత్రం గందరగోళానికి గురికాకుండా స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి కూర్చుని చర్చించాలన్నారు. ప్రతి ఒక్క ఓటరు డేటాను సేకరించి, అన్ని సర్టిఫికేట్లను సరిచూసుకోవాలని చెప్పారు. ఈ విషయం లో ఎవరూ నిర్లక్ష్యం వహించ కూడదన్నారు
సంక్షేమ రాజ్యమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న తర్వాత ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతోందని భట్టి విక్రమార్క చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసినప్పటికీ క్షేత్రస్థా యిలో ప్రజలకు, రైతులకు ఆశించిన స్థాయి లో మౌలిక వసతులు కల్పించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను, అప్పులను అధిగమిస్తూ రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అయన స్పష్టంగా ప్రకటించారు.
గత కేసీఆర్ ప్రభు త్వం చేసిన అడ్డగోలు అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో చేసిన అప్పులకు నేడు ప్రజా ప్రభుత్వం అసలు వడ్డీతో కలిపి ఏడాదికి రూ.76 వేల కోట్లను కడుతోందని ఆయన తెలిపారు.
లక్ష కోట్లతో కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు కేవలం రెండేళ్లలోనే కూలిపోయిందని ఆయన అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడంతోనే అవినీతి ఎంత మేర జరిగిందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన మరొక్కసారి చెప్పారు. గాలి వార్తలతో అబద్ధాలను పోగేసి రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టాలని రాష్ట్రం మీద పడి నలుగురు తిరుగుతున్నారని బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి విమర్శించారు. వారికి ప్రజలు గతంలోనే గుణపాఠం చెప్పారని భట్టి అన్నారు.






