30 August, 2026 | 1:30 AM

క్యాబినెట్ తీరులో మార్పు రావాలి

30-08-2026 12:33 AM
  1. పార్టీ గీత దాటి మాట్లాడే వారిపై కఠిన చర్యలు ఉండాలి 
  2. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా, సర్కార్ పనితీరు, పార్టీ అంతర్గత పరిస్థితులపై ఆయన కీలకంగా స్పందించారు.

ప్రభుత్వం ఇంకా చేయాల్సిన పని ఎంతో మిగిలి ఉందని, ప్రభుత్వంతో పాటు క్యాబినెట్ పనితీరులోనూ స్పష్టమైన మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో క్రమశిక్షణ లోపించిందని, వర్గపోరు (గ్రూపు తగాదాలు) తగ్గించుకోకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.

పార్టీ గీత దాటి ప్రవర్తించే వారిపై కఠినంగా వేటు వేయాలని స్పష్టం చేశారు. పెంచుతామని హామీ ఇచ్చిన పెన్షన్లను తక్షణమే అమలు చేయాలని, రైతు భరోసా పథకాన్ని విధిగా కొనసాగించాలని కోరారు. అలాగే వివాదాస్పద 22ఏ నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కేడర్ అసంతృప్తితో ఉంది

ప్రభుత్వంలో అనవసర ఉచితాలను తగ్గించి, తెలంగాణ ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన కేడర్లో పేరుకుపోయిన అసంతృప్తిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మార్పులన్నీ సరిగ్గా పూర్తి చేస్తేనే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని,

లేకపోతే రాబోయే రోజుల్లో చాలా కష్టమవుతుందని వ్యాఖ్యానించారు. అన్నింటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.