30 August, 2026 | 2:24 AM

చిరాగ్ X జీతన్

30-08-2026 01:27 AM
  • ఎన్డీయే కూటమిలో ‘కోటా హటావో’ మంట
  • ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య వాగ్యుద్ధం
  • ఎస్సీ, ఎస్టీ కోటాకు క్రీమిలేయర్ వర్తింపజేయాలని మంఝీ ప్రతిపాదన
  • దళిత వర్గాల విభజనకు దారి తీస్తుందని చిరాగ్ అభ్యంతరం
  • మంత్రి పదవికి జీతన్ రాజీనామా చేయాలని చిరాగ్ డిమాండ్

న్యూఢిల్లీ, ఆగస్టు ౨౯: ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ ఉద్యమం అధికార ఎన్టీయే కూటమిలో చిచ్చుపెట్టింది. రిజర్వేషన్లు రాజ్యాంగం అణగారిన వర్గాలకు ఇచ్చిన ప్రాథమిక హక్కు అని, కోటాను తీసేసే అధికారం ఎవరికీ లేదని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఉద్ఘాటించగా, ఇప్పటికే కోటా అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు క్రీమిలేయర్ వర్తింపజేయాలని హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాదు.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వర్తింపజేస్తున్న కోటాపై హేతుబద్ధమైన వర్గీకరణ అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొత్తానికి ‘రిజర్వేషన్లు హటావో’, క్రీమిలేయర్ వర్తింపుపై ఈ ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్నది. ఈ వివాదం శనివారం తారస్థాయికి చేరుకున్నది. ఎస్సీ రిజర్వేషన్ల సమీక్ష, క్రీమిలేయర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర మంత్రి జితన్ రాం మాంఝీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని మరో కేంద్ర మంత్రి చిరాగ్ డిమాండ్ చేశారు. ఈ ఇద్దరు బీహార్ నేతల మధ్య వివాదం ఎన్డీయే కూటమిలో చిలికి చిలికి గాలివానయ్యేలా కనిపిస్తున్నది.

వర్గీకరణను అంగీకరించం: చిరాగ్

ఎస్సీ రిజర్వేషన్లలో అమలులో ఎలాంటి వర్గీకరణ లేదా క్రీమిలేయర్‌ను లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అంగీకరించదని పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ తేల్చిచెప్పారు. క్రీమిలేయర్ అమలు కావాలని భావించేవారు, ముందుగా తాము అనుభవిస్తున్న రిజర్వేషన్ ప్రయోజనాలను, ప్రభుత్వ పదవులను త్యజించాలని మాంఝీని ఉద్దేశించి చురకలంటించారు.

మాంఝీకి ఆయా విధానాలపై నిబద్ధత ఉంటే ముందు తనతోపాటు బీహార్ మంత్రి, తన కుమారుడు సంతోష్‌కుమార్ సుమన్ తమ పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఎస్సీ వర్గాలన్నీ దశాబ్దాలుగా ఐక్యంగా ఉన్నాయని, ఆర్థిక ప్రాతిపదికన వారి మధ్య విభజన తీసుకురావాలని చూడటం అవివేకమని ఎద్దేవా చేశారు. ఎస్సీల మధ్య విభజన వస్తే సామాజిక న్యాయం పోరాటానికే అర్థం లేకుండాపోతుందని అభిప్రాయపడ్డారు.