మమత బెనర్జీపై కేసు
హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై ఎఫ్‌ఐఆర్
మరికొందరు పార్టీ విద్యార్థి నేతలపై కూడా
కోల్‌కతా, ఆగస్టు 29: పశ్చిమ బంగాల్ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. బెనర్జీతో పాటు టీఎంసీపీ (తృణమూల్ ఛాత్ర పరిషత్) సమావేశ నిర్వాహకులపై కూడా కోల్‌కతాలోని హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉల్లంఘనల్లో ప్రమేయమున్న వారందరి పాత్ర దర్యాప్తు క్రమంలో పరిశీలిస్తామన్నారు. ఆగస్ట్ 28న టీఎంసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మమతా బెనర్జీకి సంబంధించిన ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభకు పోలీసులు అనుమతించలేదు. దీంతో టీఎంసీ హైకోర్టును ఆశ్రయించడంతో పలు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ సందర్భంగా భారీ కటౌట్‌లు, హోర్డింగ్‌లు పెట్టారు. ఇది గుర్తించిన కేఎంసీ (కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్) కామాక్ స్ట్రీట్‌లో టీఎంసీ గుర్తులతో ఉన్న అనధికారిక హోర్డింగ్‌ను తీసివేసేందుకు ప్రయత్నించింది.
దీంతో టీఎంసీ నాయకులు, కార్యకర్తలు వారితో ఘర్షణకు దిగారు. అధికారులు పోలీసుల సహాయంతో వాటిని తొలగించేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ చర్యను నిరసిస్తూ కేఎంసీ, హేస్టింగ్స్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పలు కారణాలు చూపారు. విచారణ సందర్భంగా హైకోర్టు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. కాగా ఈ చర్యను టీఎంసీ ఖండించింది. బీజేపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించింది.






