30 August, 2026 | 5:19 AM

జెన్ ఆల్ఫాకు దిక్సూచి ‘ఆదిత్య’!

30-08-2026 01:08 AM
  1. పౌర హక్కులు, అధికార పరిధిపై జాతీయస్థాయిలో చర్చకు తెరలేపిన ఆరేళ్ల బాలుడు
  2. సీనియర్ జర్నలిస్టుల ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు 
  3. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, బాధ్యతలపై  తనకు స్పష్టమైన అవగాహన ఉందని నిరూపణ
  4. తల్లిదండ్రులపై పోలీసుల అనుచిత వ్యవహారంపై ఎస్పీ, పోలీసు అధికారులను నిలదీసిన వైనం
  5. ఎస్పీతోపాటు పోలీసు అధికారులపై పాట్నా హైకోర్టును ఆశ్రయించిన బాలుడు

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) (Bihar Public Service Commission) పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో పాట్నాలో కొనసాగుతున్న విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనల మధ్య ఆరేళ్ల బాలుడు.. ఒకటో తరగతి విద్యార్థి ఆదిత్యకుమార్ అనూ హ్యంగా దిక్సూచీలా, ప్రభావవంతమైన ప్రతీకగా నిలిచాడు.

పౌరుల హక్కులు, పోలీసుల జవాబుదారీతనం, చిన్నారులకు కూడా రాజ్యాం గ పరిరక్షణలు ఎంతవరకు వర్తిస్తాయన్న అంశాలపై జాతీయ స్థాయిలో చర్చకు కారణమయ్యాడు. సీనియర్ జర్నలిస్టుల ప్రశ్నలకు బుడ్డో డు ధైర్యంగా సమాధానాలు ఇస్తున్నాడు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, బాధ్యతలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని నిరూపి స్తున్నాడు.

తల్లిదండ్రులపై పోలీసుల అనుచిత వ్యవహారంపైనా ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. ఎస్పీ, పోలీసు అధికారులను నిలదీస్తున్నాడు. అంతేకాదండోయ్..! ఈ బాలుడు ఎస్పీతోపాటు పోలీసు అధికారులపై పాట్నా హైకోర్టును ఆశ్రయించాడు. 2026 ఆగస్టు 25న పాట్నా లోని డాక్ బంగ్లా చౌక్, ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని ప్రాంతాల్లో ఉద్యోగార్థులు, విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఈ సమయంలో ఆదిత్య తన తల్లిదండ్రులతో కలిసి నిరసనల్లో పాల్గొన్నాడు. సాధారణ దుస్తుల్లో, అప్పుడప్పుడు చేతిలో త్రివర్ణ పతాకంతో కనిపించిన అతడు పోలీసుల చర్యలను ప్రశ్నిస్తున్న దృశ్యాలు వీడియోల్లో నమోదయ్యాయి. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో పాటు నిరుద్యోగం,

యువత భవిష్యత్తు వంటి అంశాలపై మాట్లాడాడు. తరువాత తనను పోలీసులు కోత్వాలి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆదిత్య ఆరోపించాడు. అక్కడ సుమారు ఐదు నుంచి 8 గంటల పాటు తనను ఉంచారని, తల్లిదండ్రుల నుంచి వేరు చేశారని, ఇకపై నిరసనల్లో పాల్గొనవద్దని బెదిరించారని నిర్భయంగా చెప్పాడు.

అంతేకాకుండా తన తల్లిదండ్రులపై పోలీసులు భౌతికంగా దాడి చేశారని కూడా ఆరోపించాడు. అయితే పోలీసులు మాత్రం బాలుడిని అధికారికంగా అరెస్టు చేయలేదని, నిర్బంధించలేదని స్పష్టం చేశారు. నిరసనల సమయంలో వాటర్ క్యాన్లు,

లాఠీచార్జి వంటి పరిస్థితులు నెలకొనడంతో బాలుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని అతడిని అక్కడి నుంచి తరలించామని, అనంతరం కుటుంబ సభ్యులకు తిరిగి అప్పగించామని పోలీసులు వాదిస్తున్నారు. అయితే ఈ ఘటన స్థానిక నిరసనల పరిధిని దాటి జాతీయ స్థాయిలో చర్చగా మారింది.

రాజ్యాంగ ప్రస్థావనలు..

కుటుంబ సభ్యులు, మీడియా కథనాల ప్రకారం.. ఈ ఆరేళ్ల బాలుడు తన స్కూల్ బ్యాగ్‌లో భారత రాజ్యాంగ ప్రతిని తీసుకెళ్తున్నాడు. సాధా రణంగా ఈ వయసు పిల్లల బ్యాగుల్లో బొమ్మలు, కామిక్స్ కనిపిస్తే, ఆదిత్య బ్యాగులో రాజ్యాంగం ఉండటం ప్రత్యేకంగా నిలిచింది.

తాను అందులో సుమారు 80 పేజీలు చదివానని కూడా అతడు చెప్పినట్లు సమాచారం. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, అధికారానికి ఉన్న పరిమితులు, పేదలతో సహా ప్రతి సాధారణ పౌరుడికీ చట్టం ముందు గౌరవం, రక్షణ లభించాల్సిన అవసరం గురించి ఆదిత్య మాట్లా డాడు.

ఇంటర్వ్యూల్లో అతడు అడిగిన ప్రశ్నలు కూడా గమనార్హంగా నిలిచాయి. ఒక జూనియర్ అధికారి తప్పు చేస్తే అతని పై అధికారిని ఆశ్రయిస్తామని, పైస్థాయి అధికారి కూడా తప్పు చేస్తే మరింత ఉన్నతస్థాయికి చివరకు ప్రధానమంత్రి వరకు వెళ్లాల్సి ఉంటుందని అతడు పేర్కొన్నాడు.

తల్లిదండ్రుల నుంచి చిన్నారిని ఎక్కువసేపు వేరు చేసే అధికారం పోలీసులకు ఏ చట్టం ఇస్తుందని ప్రశ్నించిన అతడు, నిరసన కారులపై బలప్రయోగం చేయడం ఎంత వరకు సమంజసమని కూడా నిలదీశాడు.

ప్రతి పౌరుడికీ సజీవ హక్కుల పత్రం

ఆరేళ్ల బాలుడి సూటి, సరళమైన భాషలో అడిగిన ఈ ప్రశ్నలు ప్రజల్లో చర్చకు దారితీశాయి. రాజ్యాంగం అనేది కేవలం ఉన్నతవర్గాల కోసం ఏర్పాటుచేసిన ఒక అధికారిక పత్రం కాదని, ప్రతి పౌరుడికీ అందుబాటులో ఉన్న సజీవ హక్కుల పత్రం అని ఆదిత్య మాటలు గుర్తు చేస్తున్నాయని అతడి మద్దతుదారులు అంటున్నారు.

అయితే చిన్నారిని ఉద్రిక్తమైన వీధి నిరసనల్లో భాగం చేయడం ఎంతవరకు సమంజస మన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అతడు చెబుతున్న విషయాలపై పెద్దల ప్రభావం ఎంతమేర ఉందన్న అంశాన్ని కూడా పరిశీలిం చాల్సిన అవసరం ఉందని విమర్శకులు, పరిశీలకులు సూచిస్తున్నారు.

అయినప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపిస్తూ, రాజ్యాంగ హక్కులను ప్రస్తావిస్తున్న ఆరేళ్ల బాలుడి దృశ్యాలు సాధారణ పౌరులతో అధికారులు ఎలా వ్యవహరి స్తున్నారన్న ప్రశ్నను ముందుకు తెచ్చాయి.

 పోలీసుల చర్యలపై హైకోర్టుకు..

ఆదిత్య తండ్రి కూలీగా, తల్లి గృహ సహాయకురాలిగా పనిచేస్తున్నారని సమాచారం. ఆదిత్య కుటుంబం పునైచక్‌లో అద్దె ఇంట్లో నివసి స్తోంది. ఇలాంటి సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన బాలుడు అధికార వ్యవస్థను ప్రశ్నించడం ఈ కథనానికి మరింత భావోద్వేగాన్ని, రాజకీ య ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

ఆగస్టు 27, 28 తేదీల్లో ఆదిత్య తన తల్లిదండ్రులతో కలిసి పాట్నా హైకోర్టుకు హాజరైనట్లు సమాచారం. పోలీసుల చర్యలపై న్యాయపరమైన జోక్యం కోరుతూ కుటుంబం అక్కడ తమ వాదనలను వినిపించినట్లు తెలుస్తోంది. తమపై అక్రమ నిర్బంధం, దాడి అంశాలపై చర్యలు తీసుకోవాలని వారు కోరినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ఐపీఎస్ లేదా డీఎస్పీ స్థాయి అధికారు లుగా పేర్కొన్న కొందరు సీనియర్ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కుటుంబం డిమాండ్ చేసినట్లు సమాచారం. పేదలపై జరుగు తున్న అన్యాయం, అధికారుల అధికార దుర్వినియోగంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని కూడా ఆదిత్య చెప్పాడు. తన ఫిర్యాదును పట్టిం చుకోకపోతే ఇతర రాజకీయ నాయకులను కూడా ఆశ్రయిస్తానని, అవసరమైతే ధర్నాకు కూర్చుంటానని హెచ్చరించినట్లు సమాచారం.

మీడియా ప్రశ్నలకు ధైర్యంగా జవాబులు

కోర్టు సమీపంలో మీడియాతో మాట్లాడటం.. ఒక రకంగా విలేకరుల సమావేశాన్ని తలపించింది. సీనియర్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆదిత్య ఎంతో ప్రశాంతంగా, ధైర్యంగా సమాధానాలు ఇవ్వడం అందరి దృష్టినీ ఆకర్షించింది. తనపై చర్య తీసుకున్న అధికారులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలుడు డిమాండ్ చేశాడు.

తన తల్లిదండ్రులపై పోలీసులు దురుసుగా వ్యవహరించా రని చేసిన ఆరోపణలను పునరుద్ఘాటించా డు. ఈ ఘటన కేవలం తన కుటుంబానికి సంబంధించిన అంశంగా కాకుండా, అధికార వ్యవస్థ జవాబుదారీ తనానికి సంబంధించిన లోతైన సమస్యగా అతడు ప్రస్తావించాడు. మీడియాను ఎదుర్కొన్న తీరు కూడా ప్రత్యేకంగా చర్చనీ యాంశమైంది. అనేక మైక్రోఫోన్ల ముందు నిలబడి, తన మాటలను స్పష్టంగా, ఎలాంటి తడబాటు లేకుండా పదేపదే వివరించాడు.

భవిష్యత్ తరాలకు.. అందులోనూ తన తరానికి.. వ్యవస్థ వైఫల్యం కాకుండా ఉద్యోగాలు, న్యాయమైన పరీక్షా విధానం కావాలని అతడు పేర్కొ న్నాడు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసు వ్యవస్థపై తనకు ఉన్న అభిప్రా యం వల్ల తాను భవిష్యత్తులో పోలీసు అధికారి కావాలనుకోవ డం లేదని కూడా చెప్పడం గమనార్హం.

అది.. క్రిమినల్ చట్టాల పరిధిలో ప్రశ్నించాలి

పౌరులపై బలప్రయోగం జరిగితే అది క్రిమినల్ చట్టాల పరిధిలో ప్రశ్నించాల్సిన అంశమని అతడు పేర్కొన్నాడు. ఆదిత్య మీడియాతో మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంత చిన్న వయసులోనే ఒక బాలుడు హక్కులు, అధికారం వంటి అంశాలపై మీడియాను ఉద్దేశించి మాట్లాడటం చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరికొందరు మాత్రం ఒక చిన్నారికి ఇంతటి మీడియా వేదిక కల్పించడం నైతికంగా ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నను లేవనెత్తారు. ఈ ఘటన బీహార్ సరిహద్దులను దాటి చర్చకు దారితీసింది.

నిరసనల్లో పిల్లలు ఉన్నప్పుడు పోలీసులు అనుసరించాల్సిన విధానాలు ఏమిటి? ‘భద్రత కోసం తరలించడం’, వాస్తవానికి ‘నిర్బంధిం చడం’ మధ్య గీత ఎక్కడ ఉంది? పోలీసు అధికారులపై వచ్చిన దాడి ఆరోపణలను ఎలా దర్యాప్తు చేయాలి? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

హక్కులు సమానంగా వర్తిస్తాయా? 

అయితే.. అంతకంటే లోతైన ప్రశ్నలను కూడా ఈ ఘటన లేవనెత్తుతోంది. రాజ్యాంగం హామీ ఇచ్చే చట్టం ముందు సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి హక్కులు ఒక కూలీ కుమారుడికీ, అధికారంలో ఉన్న వ్యక్తికీ సమానంగా వర్తిస్తాయా? తన హక్కుల కోసం దేశ రాజ్యాంగాన్నే ఆధారంగా చేసుకుని అతిపిన్న వయస్కుడైన పౌరుడు ప్రభుత్వ వ్యవస్థను ప్రశ్నిస్తే, ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న పెద్దలు ఎలా స్పందించాలి?

ఆదిత్య కుటుంబానికి మద్దతుదారుల అభిప్రాయం ప్రకారం.. ఈ వ్యవహారం సాధారణ ప్రజలకు అందుబాటులో ఉన్న ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలు నిజంగా పనిచేస్తున్నాయా లేదా అన్నదానికి ఒక పరీక్షగా మారింది. మరోవైపు, చిన్నారిని అతిగా చిత్రీకరిం చకుండా.. అతడు చేసిన ఆరోపణలను సరైన న్యాయపరమైన ప్రక్రియలోనే పరిశీలించాలని విమర్శకులు సూచిస్తున్నారు.

అధికార గుండెల్లో..ఆరేళ్ల బుల్లెట్!

రాజ్యాంగ హక్కులను ప్రస్తావిస్తూ, హైకోర్టును ఆశ్రయించి, సీనియర్ జర్నలిస్టుల బృందాన్ని ప్రశాంతంగా ఎదుర్కొన్న ఆరేళ్ల బాలుడి చిత్రం ఇప్పటికే ప్రజా చర్చను మార్చేసింది. రాష్ట్రాధికారం, నిరుద్యోగం, సంస్థాగత జవాబుదారీతనం వంటి అంశాలపై దేశంలో తరచూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

అలాంటి సమయంలో పాట్నాకు చెందిన ఆరేళ్ల ఆదిత్య కుమార్ అనూహ్యంగా ముందుకొచ్చి ఒక అసౌకర్యకరమైన, అత్యంత సరళమైన ప్రశ్నను దేశం ముందుంచాడు ఒక చిన్నారే రాజ్యాంగాన్ని ఇంత స్పష్టంగా అర్థం చేసుకుని తన హక్కులను ప్రశ్నించగలిగితే, ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న పెద్దల గురించి అది ఏమి చెబుతోంది?

ఈ వ్యవహారం ఇకపై న్యాయపరమైన చర్యలు, రాజకీయ స్పందనలు, ప్రజా చర్చలతో మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. చివరికి విచారణలో ఏం తేలుతుందన్నది పక్కన పెడితే.. దేశ రాజ్యాంగాన్ని తనకు ఆధారంగా చేసుకుని అధికారాన్ని ప్రశ్నించిన పాట్నాకు చెందిన ఈ ఆరేళ్ల బాలుడు అతిచిన్న గొంతుక కూడా అధికార వ్యవస్థను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునేలా చేయగలదని ఇప్పటికే చూపించాడు.

ఈ కథనం వెలుగులోకి వచ్చే సమయానికి ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి తీసుకున్న చర్యలు, సీనియర్ అధికారులపై నిర్దిష్టమైన అభియోగాల విషయంలో తుది న్యాయపరమైన నిర్ణయం వెలువడినట్లు స్పష్టమైన సమాచారం లేదు.