మౌలానా మృతి.. జింకలగూడెంలో ఉద్రిక్తత
నిందితుడి ఇంటికి నిప్పు.. మృతదేహంతో బంధువుల ఆందోళన
బూర్గంపాడు,(విజయక్రాంతి): వివాహేతర సంబంధం విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి మృతికి దారితీసింది. హత్యాయత్నం ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జింకలగూడెం గ్రామానికి చెందిన షేక్ మౌలానా (42) శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో బూర్గంపాడు మండలం జింకలగూడెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్రహించిన మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటిపై దాడి చేసి నిప్పంటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. జింకలగూడెం గ్రామానికి చెందిన మౌలానా, అదే గ్రామానికి చెందిన ఇస్మాయిల్ మధ్య వివాహేతర సంబంధం విషయమై ఈ నెల 23న వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇస్మాయిల్ కారుతో మౌలానాను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మౌలానాను కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.మృతుడి సోదరుడు నాగుల్‌మీరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేశారు. నిందితుడు ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి ఇంటికి నిప్పు
మౌలానా మృతి చెందిన విషయం తెలియడంతో జింకలగూడెంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు నిందితుడు ఇస్మాయిల్ ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
మృతదేహంతో ఆందోళన
బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, నిందితుడి కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, మృతుడి బంధువులు నిందితుడి ఇంటి ఎదుట మృతదేహంతో బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాల్వంచ డీఎస్పీ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆందోళనకారులతో పోలీసులు పలుమార్లు చర్చలు జరిపినా వారు శాంతించలేదు. దీంతో జింకలగూడెంలో పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.






