30 March, 2026 | 2:59 AM

ఎథిక్స్ కమిటీనే లేదు

30-03-2026 01:14 AM
  1. లేని కమిటీకి సిఫార్సులు హాస్యాస్పదం
  2. ప్రతిపక్ష పార్టీతో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కు
  3. కడియం శ్రీహరి పట్ల ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీరు సరైందికాదు!
  4. కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): ‘అసెంబ్లీలో అసలు ఎథిక్స్ కమిటీనే లేదు. లేని కమిటీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అంశాన్ని సిఫార్సు చేయడం హాస్యాస్పదం’ అంటూ కేంద్ర హోం సహాయ మంత్రి బండిసంజయ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఆదివారం నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.

సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరితో అసెంబ్లీలో బీఆర్‌ఎస్ సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరైంది కాదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి మధ్య డీల్ కుదిరిందని చెప్పుకొచ్చారు. ఇకపై కేసీఆర్, కేటీఆర్ అవినీతి కేసుల జోలికి సీఎం వెళ్లే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. అలాగే, జాగృతి అధ్యక్షురాలు కవితతో కేటీఆర్ సంధికి ప్రయత్నిస్తున్నారని, దీనిలో భాగంగానే హరీశ్‌రావు టార్గెట్ అవుతున్నాడని వ్యాఖ్యానిం చారు. హరీశ్‌రావుతో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు సీఎం రేవంత్ సలహా ఇస్తున్నారని తెలిపారు.

భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేయాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని, 100 శాతం కేటీఆర్, రేవంత్‌రెడ్డి ఒక్కటేనని వ్యాఖ్యానించారు. రేవంత్‌కు కేసీఆర్‌పై కోపం కూడా పోయిందని, కేటీఆర్, రేవంత్‌రెడ్డి ఒక్క టా? కాదా? అనేది హరీశ్‌రావు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కాళేశ్వరంపై మాత్రమే సీబీఐ విచారణ జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరుతున్నారని, మరీ మిగతా అవినీతి కేసుల పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించారు.

కేవలం సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డకు సంబంధించి రూ.9 వేల కోట్ల అవినీతిపైనే సీబీఐ విచారణ జరపాలని ఎందుకు పట్టుపడుతున్నట్లు? అందులోనే హరీశ్‌రావు పాత్ర ఉన్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని తెలిపారు. మైన్స్ స్కాంపై తూతూమంత్రపు విచారణ అని చెబుతున్నారే తప్ప, సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి లేదని కొట్టిపడేశారు. కాంగ్రెస్ చెప్పినట్లే బీజేపీ ఆడుతుందని చెప్పడం సిగ్గుచేటని, కేటీఆర్ అతిపెద్ద అవినీతిపరుడని ఆరోపించారు.

ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రాజకీయ కుటుంబ వారసుల కు బీజేపీ టిక్కెట్లు ఇవ్వబోమని తేల్చిచెప్పారని, అట్లాంటప్పుడు అవినీతి కుటుంబ పార్టీతో తాము పొత్తు ఎందుకు పెట్టుకుంటామని పేర్కొన్నారు. బీజేపీకి దక్షిణాది, ఉత్తరాది అనే తేడా ఉండదని, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బు లు సమకూరుస్తున్నదే సీఎం రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు.