30 March, 2026 | 3:30 AM

ఇక భూతల యుద్ధం!

30-03-2026 01:22 AM
  1. పశ్చిమాసియాకు చేరుకున్న అమెరికా బలగాలు
  2. రెండు మెరైన్ గ్రూపులతో సహా మొత్తం 3,500 దాటిన అగ్రరాజ్య బలగాలు 
  3. లెబనాన్‌లో దాడులకు దిగిన ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, సైనికులు
  4. 10 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేస్తున్న ఇరాన్

యుద్ధం వద్దంటూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విధానాలను తప్పుబడుతూ శనివారం అమెరికాలోని ౫౦ రాష్ట్రాల్లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. అమెరికా సైనికులు అద్దెకు లేరంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఐరోపాలోని లండన్, పారిస్, రోమ్ నగరాల్లో, లాటిన్ అమెరికా దేశాల్లో లక్షలాదిమంది ‘నో కింగ్స్’ ప్రదర్శనలకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు రాజ్యాంగ పరిధులకు లోబడాలేకాని, పౌరుల స్వేచ్ఛకు, భద్రతకు ముప్పు తలపెట్టకూడదని వారు నినదించారు.

వాషింగ్టన్/ టెహ్రాన్/జెరూసలేం: మార్చి 29: ఇంధనభూమిలో ఇక భూతలయుద్ధానికి సమయం ఆసన్నమైనట్లు కన్పిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం భయంకరమైన రూపుదాల్చింది. ఒకవైపు ఇరాన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాం అంటూనే అమెరికా యుద్ధాన్ని విస్తరిస్తున్నది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా లో తన సైనికులను దించడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.

తాజాగా అమెరికా కు చెందిన అధునాతన యుద్ధనౌక యూఎస్‌ఎస్ ట్రిపోలి పశ్చిమాసియాకు చేరుకుంది. ఇందులో 2,500 మంది మెరైన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి రాకతో ఇక్కడ మోహరించి న మొత్తం అదనపు బలగాల సంఖ్య 3,500 దాటినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తన ఎక్స్‌లో వెల్లడించింది. మరో పక్క దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, సైని కులు ప్రవేశించి, భీకర దాడులు చేస్తున్నట్లు సమాచారం.

పశ్చిమాసియాలో గత 20 ఏళ్లలో అమెరికా ఇంత భారీ సంఖ్యలో బలగాలను మోహరించడం ఇదే తొలిసారిని పరిశీలకులు పేర్కొంటున్నారు. అధునాతన ఉభయచర యుద్ధనౌక అయిన ఈ యూఎస్‌ఎస్ ట్రిపోలి ఇటీవలి వరకు జపాన్ తీరంలో మోహరించి ఉంది. దాన్ని రెండు వారాల క్రితం అత్యవసరంగా పశ్చిమాసియాకు తరలించాలని ఆదేశించడంతో అది పశ్చిమాసియాకు చేరింది.

దీనిపై ఎఫ్-35 ఫైటర్ జెట్లతో సహా అనేక యుద్ధ విమానాలను మోహరించడానికి అవకాశం ఉంది. వేలాది మంది అదనపు మెరైన్లు, పారాట్రూపర్లు, యుద్ధనౌకలను మధ్యప్రాచ్యం వైపు అమెరికా తరలించింది. సుమారు 4,500 మంది సైనికులతో కూడిన రెండు మెరైన్ ఎక్స్ పిడిషనరీ యూనిట్లు, రెండు యుద్ధనౌకలలో, పసిఫిక్‌కు ఇరువైపుల నుంచి ఇప్పటి కే పశ్చిమాసియాకు తరలించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉభయచర దాడి యుద్ధనౌక అయిన యూఎస్‌ఎస్ ట్రిపోలిలో ఉన్న 2,200 మంది మెరైన్ల మొదటి బృందం మధ్యప్రాచ్యానికి చేరినట్లు తెలుస్తోంది.

దాడి నౌక యూఎస్‌ఎస్ బాక్సర్‌లో రెండో బృందం ఏప్రిల్ మొదటి వారంలో చేరుకోవచ్చు. అదనంగా, యూఎస్ ఆర్మీకి చెందిన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన సుమారు 2,000 మంది సైనికులు మధ్యప్రాచ్యానికి తరలివెళ్లారు. ఈ సైనికులను 18 గంటల్లోపు ప్రపంచంలో ఎక్కడైనా మోహరించవచ్చు. భూతల దళాలు నియంత్రణలోకి తీసుకునే ముందే పారాచూట్ దాడులు చేయడానికి, విమానాశ్రయాలను స్వాధీనం చేసుకోవడానికి వీరికి శిక్షణ ఇవ్వబడింది.

ఈ విధంగా, రెండు మెరైన్ గ్రూపులతో పాటు, అదనంగా దాదాపు 7,000 మంది యూఎస్ సైనికులు ఆ ప్రాంతానికి తరలినట్లు సమాచా రం. దీంతో ఇరాన్‌పై అతిత్వరలో భూతల దాడికి అమెరికా సర్వసిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇంకోపక్క అమెరికా భూతల దాడులకు దిగితే ఎదుర్కొనేందుకు ఇరాన్ సైనిక బలగాలను సిద్ధం చేస్తోంది. 

ట్రంప్ చర్చల వ్యూహం అందుకేనా?

ఒకవైపు చర్చలు అంటూనే దాడులు కొనసాగిస్తున్న అమెరికాను ఇరాన్ విశ్వసించడం లేదు. గతంలో ఎదురైన అనుభవా లతో శాంతి చర్చలను ఆదేశం అంత సీరియస్‌గా తీసుకోవడం  లేదు. కారణం గతంలో ఇలాగే శాంతి చర్చలు అని చెప్పి దాడులు చేసిన చరిత్ర అమెరికాకు ఉండడమే దానికి కారణం. చర్చల పేరుతో భూతల యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతోందని ఇరాన్ అనుమానిస్తోంది. ఈ నేప థ్యంలో చర్చలపై దృష్టి సారించడం పక్కన పెట్టి.. అగ్రరాజ్య భూతల దాడులను తిప్పికొట్టే సన్నాహాలకు ప్రాధాన్యం ఇస్తోంది. 

‘నరకానికి స్వాగతం’: ఇరాన్

అమెరికా బలగాలు ఇరాన్‌కు చేరుకోవడంతో ఇరాన్ ఆంగ్ల పత్రిక ‘టెహ్రాన్ టైమ్స్’ వారికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ‘వెల్కమ్ టు హెల్’(నరకానికి స్వాగతం) అం టూ ఫ్రంట్ పేజీలో ప్రచురించడం సంచలనం రేపింది. ఇరాన్ నేలపై అడుగుపెట్టే ఏ యూఎస్ సైనికుడైనా.. శవపేటికలోనే తిరిగి వెళ్తాడని ఆ పత్రిక వార్నింగ్ ఇచ్చింది. 

అంతా భయాందోళన!

ఒకవేళ భూతల పోరు సాగితే అటు ఇరాన్, ఇటు అమెరికాలో తీవ్ర రక్తపాతం తప్పకపోవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, ఏవైనా ఇరాన్ ద్వీపాలను ఆక్రమించే ప్రయత్నాలపై ఇప్పటికే హెచ్చరించారు. ‘వారు గనుక హద్దు దాటితే, ఆ ప్రాంతీయ దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలన్నీ ఎలాంటి ఆంక్షలు లేకుండా నిరంతర దాడులకు లక్ష్యంగా మారతాయి’ అని ఘాలిబాఫ్ ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

అయి తే, సైనిక బలగాలను ఉపయోగించి ఖర్గ్‌ను స్వాధీనం చేసుకోవడం లేదా హోర్ముజ్ జలసంధిని సురక్షితం చేయడం గణనీయమైన ప్రమాదాలను కలిగిస్తుందని నిపుణులు హెచ్చరించారు. అటువంటి భూతల ఆపరేషన్‌లో భారీప్రాణనష్టం జరగొచ్చని అమెరి కా అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఇరాన్‌లో 10 లక్షల మంది సైన్యం సిద్ధం 

 అమెరికా సైన్యాలు ఇరాన్‌లో భూతల దాడులకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళనలు, భయభ్రాంతులను రేకెత్తిస్తున్నాయి. శత్రుదేశాల దాడులను ఢీకొట్టేందుకు ఇరాన్ కూడా సంసిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. ఇందులో భాగంగానే 10 లక్షల మందికి పైగా సైన్యాన్ని కదనరంగంలోకి దింపేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సైనికాధికారుల ఏర్పాట్లను పేర్కొంటూ.. ఆ దేశ మీడియా వెల్లడించింది.

ఈ క్రమంలోనే బసిజ్ ఫోర్స్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ)తో సహా అనేక విభాగాలు వెంటనే యుద్ధంలోకి వచ్చేలా దళాలను ఏకం చేస్తున్నట్లు ఇరాన్ సైనిక వర్గాలు తెలిపాయి. యుద్ధంలో చేరేందుకు అర్హత వయస్సును కూడా ఇరాన్ తగ్గించినట్లు సమాచారం. 12 ఏళ్ల పిల్లలను సైతం యుద్ధంలోకి అనుమతివ్వాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు స్పష్టంచేశాయి. దీనికి ‘ఫర్ ఇరాన్’ పేరు పెట్టినట్లు తెలిపాయి.

దీంతో భూతల పోరును ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వియత్నాం, ఇరాక్, అఫ్గానిస్థాన్‌లో అమెరికా సైనిక పోరాట తీరుతెన్నులను క్షుణ్నంగా అధ్యయనం చేసింది. చైనా, రష్యా నుంచి శిక్షణ కూడా పొందింది. తమ అమ్ములపొదిలోని మెరుగైన ఆయుధాలను భూతల పోరు కోసం ఇరాన్ దాచి ఉంచిందని సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ భూతల పోరు సాగితే అటు ఇరాన్, ఇటు అమెరికాలో తీవ్ర రక్తపాతం తప్పకపోవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

లెబనాన్‌లోకి ఇజ్రాయెల్..

దక్షిణ లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, సైనికులు ప్రవేశించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని ఖిబనాన్‌లోని తదితర ప్రాంతాల్లో యుద్దం మొదలైనట్లుగా న్యూయార్క్ టైమ్ పత్రిక పేర్కొంది.

దక్షిణ లెబనాన్‌పై ఇప్పటికే భయంకరమైన దాడులు చేసిన ఇజ్రాయెల్, ఆ ప్రాంతాన్ని మరో గాజా వలే విధ్వంసం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని వంతెనలను అన్నింటినీ ఇజ్రాయె ల్ ఇప్పటికే పేల్చేసింది. దాదాపు 20 లక్షల మంది ఇజ్రాయెల్ దాడుల్లో నిరాశ్రయులయ్యారు.