కన్నోళ్లకు భరోసా
- తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లుకు ఆమోదం
- పీఆర్, వాల్యూ యాడెడ్ పన్ను సవరణ, గిగ్ వర్కర్ల బిల్లులూ పాస్
- విద్వేషపూరిత ప్రసంగాల నివారణ బిల్లుకూ ఓకే
- సమావేశాలు సోమవారానికి వాయిదా.. స్పీకర్ నిర్ణయం
- వృద్ధ తల్లిదండ్రుల కోసమే చట్టం: సీఎం రేవంత్‌రెడ్డి
- కన్నవారిని నిర్లక్ష్యం చేసేవారిని చూసే చట్టం తెచ్చామని స్పష్టీకరణ
హైదరాబాద్, మార్చి ౨౯ (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు ఆదివారం అసెంబ్లీలో ఆమోదం పొందాయి. వీటిలో ముఖ్యమైనది ప్రభు త్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు భరోసానిస్తూ ప్రవేశపెట్టిన ‘తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లు’. ఈ బిల్లును రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రవేశపెట్టగా, అధికార పార్టీ సహా బీజేపీ, సీపీఐ, ఎంఐఎం సభ్యులు సంపూర్ణమైన మద్దతు తెలిపారు.
పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి సీతక్క, తెలంగాణ ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లును మంత్రి వివేక్ వెంకటస్వామి, విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లును సీఎం రేవంత్‌రెడ్డి తరఫున మంత్రి శ్రీధర్‌బాబు, విద్వేషపూరిత మైన ప్రసంగం, ద్వేషపూరితమైన నేరాలను నివారించే బిల్లును మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపాదించారు. బిల్లులపై సభలో చర్చ జరిగింది.
సీఎం రేవంత్‌రెడ్డి తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుపై ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థ అధినేతల జీవితాలు పిల్లల సంరక్షణ లేక, ఏమయ్యాయనేది సోదాహరణంగా వివరించారు. అలాగే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదా యం, వ్యయం, గ్రాంట్లపైనా చర్చ జరిగింది. అనంతరం ఐదు బిల్లులను సభ ఆమోదించింది. తర్వాత సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ఉదయం 10 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు.
ఎంతో సమాలోచన చేశాం: సీఎం
తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత ’ బిల్లును ఎంతో బాధ్యతతో, భావోద్వేగంతో ఆలోచన చేసి తీసుకువచ్చామని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారని, పిల్లలు మాత్రం రెక్కుల వచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం అమానవీయమని పేర్కొన్నారు. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చినట్లు సభలో వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా సీఎం పురాణాల్లో శ్రవణుడి కథను ఉటంకించారు. రేమండ్స్ వస్త్ర వ్యాపార దిగ్గజం విజయ్‌పథ్ సింఘానియా చివరి దశలో అనుభవించిన దీనస్థితిని వివరించారు. ‘వృద్ధుల సంరక్షణ కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చింది. కేంద్ర చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని అనసరిస్తూనే తెలంగాణ లో చట్టం చేశాం. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతోపాటు ప్రజాప్రతినిధులెవరైనా తమ తల్లి దండ్రులను చూసుకోకపోతే వారి వేతనం నుంచి 15 శాతం, లేదంటే రూ.10 వేలు కట్ చేసి.. వారి ఖాతాల్లో జమ చేస్తాం’ అని సీఎం వివరించారు.
శ్రవణ కుమారుడి కథ ఇది..
‘పురాణాలలో మాతృ పితృ భక్తికి మారుపేరుగా నిలిచిన శ్రవణ కుమారుడి కథను ఒకసారి గుర్తుతెచ్చుకుందాం. చూపులేని తన వృద్ధ తల్లిదండ్రుల కోరిక మేరకు, శ్రవణుడు వారిని ఒక కావిడి బుట్టలలో కూర్చోబెట్టుకుని తన భుజాలపై మోస్తూ పుణ్యక్షేత్ర దర్శనానికి తీసుకువెళ్లాడు. ఒకరోజు సరయూ నది తీరం లో తల్లిదండ్రుల దప్పిక తీర్చడానికి శ్రవణుడు ఒక పాత్రతో నీళ్లు తీసుకుంటుండగా, ఆ శబ్దాన్ని విని ఏదో క్రూర మృగమని పొరబడిన దశరథ మహారాజు ‘శబ్దభేది’ బాణాన్ని ప్ర యోగిస్తాడు. ఆ బాణం తగిలి శ్రవణుడు మరణించాడు.
పుత్రశోకంతో అలమటించిన ఆ వృద్ధ దంపతులు ‘నీవు కూడా పుత్ర వియోగంతోనే మరణిస్తావు’ అని దశరథుడిని శపిస్తారు. తల్లిదండ్రులను ప్రేమించడంలో శ్రవణ కుమారుడిని ఆదర్శంగా తీసుకుంటే ఎలాంటి చట్టా లు, ఎలాంటి నిబంధనలు అవసరం లేదు’ అని సీఎం పేర్కొన్నారు. ‘ప్రఖ్యాత రేమండ్స్ వస్త్ర వ్యాపారి విజయ్‌పథ్ సింఘానియా (87) మార్చి 28న ముంబైలో కన్నుమూశారు. వ్యాపారవేత్తగా విజయవంతమైన జీవితాన్ని గడిపిన సింఘానియా, చివరికి కొడుకు చేసిన ద్రోహంతో అనామికుడిగా తనువు చాలించా ల్సి వచ్చింది.
విజయ్‌పథ్ సింఘానియా తన జీవితకాలపు కష్టార్జితాన్ని, సుమారు రూ. 1,000 కోట్ల విలువైన రేమండ్ సామ్రాజ్యపు వాటాలను కుమారుడు గౌతమ్ సింఘానియాకు ‘గిఫ్ట్ డీడ్’ ద్వారా అప్పగించిన తర్వాత ఆయన జీవితం అత్యంత విషాదకరంగా మారింది. ఆస్తి చేతికి రాగానే గౌతమ్ తన తండ్రిని నిర్లక్ష్యం చేయడమే కాకుండా, ముంబైలోని ప్రతిష్టాత్మక ‘జేకే హౌస్’లో ఆయనకు దక్కాల్సిన నివాసాన్ని కూడా నిరాకరించి బయటకు పంపించేశారు. తన కారు, డ్రైవర్ సిబ్బందిని కూడా గౌతమ్ తొలగించడంతో ఆయన దక్షిణ ముంబైలో ఒక సాధారణ అద్దె ఇంట్లో నివసించాల్సి వచ్చింది.
ఒకప్పుడు ఆయన విమానాల్లో తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడిపారు. ఆస్తి మొత్తం కొడుకు పరం చేసిన తర్వాత, ఆయన కనీస సౌకర్యాలు లేక, సొంత ఖర్చుల కోసం కోర్టులను ఆశ్రయించాల్సిన దుర్భర స్థితికి చేరుకున్నారు. తన ఆత్మకథ ‘ఇన్ కంప్లీట్ లైఫ్’లో ఈ చేదు అనుభవాలను వివరించారు. పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశాను,
ఏ తండ్రీ నాకంటే దారుణమైన స్థితిని అనుభవించకూడదు అని ఆయన ఆ పుస్తకంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఆస్తిపాస్తులు లేకపోయినా తన భుజాలపై తల్లిదండ్రులను మోసి పుణ్యక్షేత్రాలు చూపించిన శ్రవణ కుమారుడి గాథ అజరామరమైతే.. అనామకుడిగా కన్నుమూసిన విజయ్‌పథ్ సింఘానియా ఉదంతం ఆధునిక సమాజపు చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తోంది’ అని సీఎం వ్యాఖ్యానించారు.
తల్లిదండ్రుల ఉసురు మంచికాదు..
‘అడ్డాల నాడే బిడ్డలు తప్ప.. గడ్డాల నాడు కాదు అని అనాథలుగా మారిన తల్లి దండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం ఈ సమాజానికి మంచిది కాదు . మన దేశంలో పిల్లల సామాజిక భద్రత, మహిళల భద్రత, హక్కులకు రాజ్యాంగ రక్షణతో పాటు, అనేక చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (ఏ) ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య హక్కు ఉంది. ఆర్టికల్ 24 ప్రకారం ప్రమాదకర పనుల్లో బాల కార్మికుల నిషేధం ఉంది.
అనాథలు, నిరాశ్రయ పిల్లలు, నేరాల్లో చిక్కుకున్న పిల్లల సంరక్షణ కోసం జువెనైల్ జస్టిస్ యాక్ట్ (2015) ఉంది. పిల్లలపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కోసం పోక్సో యాక్ట్ (2012) ఉంది. రైట్ టు ఎడ్యూకేషన్ యాక్ట్ (2009) ఉంది. 14 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోకూడదని చైల్ లేబర్ యాక్ట్ ఉంది. బాల్య వివాహాల నిషే ధం చట్టం ఉంది. మన దేశానికి పిల్లల హక్కులు, రక్షణ విషయంలో అనేక అంతర్జాతీయ ఒప్పందాలూ ఉన్నాయి.
మహి ళల కోసం గృహహింస నివారణ చట్టాలు ఉన్నాయి. లైంగిక నేరాలకు సంబంధించి నిర్భయ లాంటి బలమైన చట్టాలు ఉన్నాయి. వరకట్న నిషేధ చట్టం ఉంది. వృద్ధుల సామాజిక భద్రతకు సంబంధించి మన దేశంలో చట్టాలు ఉన్నాయి. పిల్లలు తమ తల్లి దండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యతగా చేస్తూ ‘మెయింటెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజిన్స్ యాక్ అమలులో ఉంది.
అయినా, సమాజంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. బతికి ఉన్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు, చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అత్యంత విషాదం. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది..పిల్లలను కనగలం కానీ, వాళ్ల బుద్ధులను కనగలమా అని అన్నట్లుగా కొందరి తీరు ఉంది ’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. లేదా ఎక్కువ మంది పిల్లలను కనే వాళ్లు. దాని వల్ల ఒకరు కాకపోయినా ఇంకొకరైనా తల్లిదండ్రుల సంరక్షణ చూసుకునే వాళ్లు.
ఈ రోజుల్లో పరిస్థితులు మారాయి కుటుంబ నియంత్రణతో ఒక్కరో ఇద్దరికో పరిమితమయ్యారు. కుటుంబం అంటే కొడుకైనా, కూతురైనా ఇద్దరూ సమానమే. ఆడబిడ్డలకు తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నా మెట్టినింటి బాధ్యతలతో ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో నాకు తెలిసిన ఒక ప్రజా ప్రతినిధి తండ్రికి క్యాన్సర్ వస్తే ఆయన్ను చూసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఇటీవల ఆ తండ్రి మరణించాడు. తల్లిదండ్రులను చూసుకోలేని పిల్లలను, ఈ సమాజం బహిష్కరించాలి.
తల్లిదండ్రుల సంరక్షణ గురించి ఆలోచించే మా ప్రభుత్వం తాజా బిల్లు తెచ్చింది. చట్టంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని మేం భావించడం లేదు. కానీ, వృద్ధ తల్లిదండ్రులకు మెజార్టీ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ముందుకు వెళ్తు న్నాం’ అని సీఎం తెలిపారు.




