మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు
- సభకురాని కేసీఆర్‌తో రాజీనామా చేయించండి
- గత ప్రభుత్వంలో మూడు హౌస్ కమిటీలేసి బ్లాక్‌మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారు
- అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మండిపాటు
హైదరాబాద్, మార్చి 29(విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ నాయకుల తాతలు దిగొచ్చినా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనా మా చేయడం జరగదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. మీరు చెప్పింది వినక పోతే పొంగులేటి రాజీనామా చేయాలా? అని ఆయన ప్రశ్నించారు. ముందు సభకు రాకుండా జీతం తీసుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
‘కేసీఆర్ చేయరు, జీతభత్యాలు వెనక్కి ఇవ్వరు.. కానీ రోజుకు 18 గంటలు పనిచేస్తూ 4.5 లక్షల ఇం దిరమ్మ ఇళ్లు కట్టిస్తూ పేదల ఇళ్లల్లో వెలుగు, వారి కళ్లలో ఆనందం నింపుతున్న పొంగులేటి మాత్రం రాజీనామా చేయాలా’ అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయి నా, రేవంత్ రెడ్డి కుటుంబమైనా.. ఎవరున్నా ఆధారాలు బయటపెట్టాలని సూచించారు. ఆధారాలంటే ఎవరి పైన అయినా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఆదివారం శాసనసభ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... రాఘవ కన్‌స్ట్ట్రక్షన్ విషయంలో 2025లో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుని ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. ఇంత పారదర్శకంగా మేం తీసుకున్న చర్యలను అభినందిస్తే మా అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేసే వారని సూచించారు.
మా ప్రభుత్వం ఇచ్చిన నోటీసును తీసుకొచ్చి వాళ్లేదో కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారని, దానిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నార ని ఎద్దేవాచేశారు. వాళ్ల ప్రభుత్వంలో మూడు హౌస్ కమిటీలు వేసి బ్లాక్‌మెయిల్ చేసి ఆస్తు లు గుంజుకున్నారని సీఎం ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి రాజకీయ లబ్ధిపొందారని మండిపడ్డారు. వారిలా హౌస్ కమిటీ వేసి రాజకీయ లబ్ధిపొందాలని మేం చూడలేదన్నారు. అందుకే పదేళ్లనుంచి ఇప్పటివరకు జరిగిన ఖనిజ సంపద దోపిడీ, అక్ర మ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణకు ఆదేశించామన్నారు.
మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా సీబీసీఐడీ అధికారులకు అందించాలని హరీష్‌రావు, కేటీఆర్, ఇతర సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఇతర పార్టీల సభ్యులు కూడా తెలంగాణ ఖనిజనసంపద దోపిడీకి సంబంధించి సమాచారం అధికారులకు ఇవ్వాలని, సంపూర్ణంగా విచారణ చేసి దోషులను శిక్షించే బాధ్య త ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
హౌస్ కమిటీ వేసినా నివేదికను మళ్లీ ఏదో ఒక ప్రభుత్వ దర్యాప్తు సంస్థకు ఇవ్వాల్సిందేనని, అందుకే మేం నేరుగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని వివరించారు. సీబీసీఐడీ పై నమ్మకం లేకపోతే సీబీఐకి విచారణ అప్పగించాలా అని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ చేయడానికే వారు హౌస్ కమిటీ కోరుతున్నారని, ఇక్కడ మీ పప్పులు ఉడకవని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు..
తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని గుర్తు చేశారు దళితులకు పరిపాలన చేయరాదని, తానే సమస్యలను పరి ష్కరిస్తానని అవమానించి కేసీఆర్ సీఎం పదవి చేపట్టారని మండిపడ్డారు. దళితునికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బర్తరఫ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2018లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దళితుడైన భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ నియమిస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వారి పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా కేసీఆర్ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని దళితుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఓర్వలేకపోయారని అన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఆయ న ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించి గౌరవించుకున్నామని, కానీ వారి ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు పదవులిచ్చుకున్నారని విమర్శించారు.
ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడితే వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, సీతక్క, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, రామచంద్ర నాయక్, వేము ల వీరేశం, అద్దంకి దయాకర్ వంటి ఎంతోమంది దళితులకు మా ప్రభుత్వంలో పదవు లు కల్పించామని చెప్పారు. దళితులను చిన్నచూపు చూసే కేసీఆర్‌కు కనువిప్పు కలిగి చేతులు కట్టుకుని నిలబడాలని మిమ్మల్ని స్పీకర్‌గా నియమించుకున్నామని వెల్లడించారు. దళితుడిని మైక్ అడగాల్సి వస్తుందని కేసీఆర్ సభకు రావడం లేదన్నారు.
స్పీకర్‌గా దళితుడు ఉండవద్దనే వాళ్లు పోడియం ముందుకు వచ్చి గొడవ చేస్తున్నారని, దళితులు మంత్రులుగా ఉండకూడదని కుట్రలు చేసి కుల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 లో పక్క పార్టీ నుంచి తీసుకుని మంత్రులను చేసినా వారే ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై పెద్ద పెద్ద స్లోగన్ లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. సీతక్కను అవమానించేలా మాట్లాడి దుర్మార్గపు సంస్కృతికి చిహ్నంగా మారిన వాళ్లు కూడా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌తో సరిసమాన నాయకుడు కడియం శ్రీహరి అని, ఆయన నిజాయితీ, నిబద్ధతను దేశంలో ఎవరూ శంకించలేరని స్పష్టంచేశారు.
సభలో కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరును హరీష్ రావు, కేటీఆర్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. కడియంకు జరిగినట్లుగా కేసీఆర్‌కు జరిగితే మీరు సమర్ధిస్తారా అని నిలదీశారు. మా దగ్గర కూడా తిరగేసి కొట్టేవారు ఉన్నారని,, కానీ ఇక్కడ మనం కుస్తీలు పట్టడానికి రాలేదన్నారు. సీనియర్ సభ్యులను అవమానించే ఇలాంటి వ్యవహార శైలి మంచిది కాదని, దీనికి ఇక్కడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అవమా నకరంగా, అసభ్యంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, హరీష్ రావు సూచన మేరకు ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని కోరారు.
హౌస్ కమిటీకు సిద్ధమా?
‘మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలో హరీశ్ రావు తమ్ముడు మహే శ్ రావు, మామ హన్మంత రావు, బావమరిది సుమన్‌రావు.. ఒక ప్రైవేట్ కంపెనీని బెదిరించి వందల ఎకరాల భూమని ధరణిని అడ్డంపెట్టుకుని బదలాయించుకున్నా రు. దీనిమీద హౌస్ కమిటీ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. హరీశ్ రావు నిజాయితీ పరుడైతే, హరీశ్ రావు నిజాయితి పరుడని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నమ్ముతే హౌజ్ కమిటీకి ఒప్పుకుని సహకరించాలి. ముందు దీనికి హరీశ్ రావు సిద్ధ మా’ అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్‌ఎస్ సభ్యులు సభలో ఆం దోళన చేపట్టడంపై, బీఆర్‌ఎస్ సభ్యులు కోరుతున్న హౌస్ కమిటీ వేయాలని బీజేపీ సభ్యులు కాటేపల్లి వెంకటరమణా రెడ్డి ప్రభుత్వానికి చేసిన సూచనను వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వారిని ఉద్దేశిస్తూ ఆదివారం శాసనసభలో మాట్లాడారు. బీజేపీ సభ్యులు సూచనలు ఇవ్వడం.. సూచనల నుంచి పారిపోవడం వారికి అలవాటుగా మారిం దన్నారు.
కాళేశ్వరంలో కెసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని, దాన్ని ఏటీఎంలా మార్చుకుందని మేం మాత్రమే కాదు.. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చి పదే పదే అన్నారన్నారు. మరోవైపు కేసీఆర్‌ను జైల్లో పెట్టడం మీవల్ల కాదు.. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారన్నారు. వీళ్ళ మాటలు నమ్మి తాము కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే, 48 గంటలు కాదు నెలలు గడుస్తున్నాయన్నారు.
కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి మీరు, వాళ్లు ఒక్కటై పార్లమెం ట్, స్థానిక ఎన్నికల్లో ఓట్లు సీట్లు పంచుకున్నారని విమర్శించారు. మీరు సూచన చేసే ముందు మీ నాయకుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కాళేశ్వరంపై సీబీఐ విచారణను చేయించి కేసీఆర్, హరీశ్ రావును ముందు జైల్లో పెట్టిన తర్వాత మీరు సూచనలు చేస్తే తాము వింటామని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి సీఎం సవాల్ చేశారు.
చెప్పిన దానికి ఒప్పుకోలేదని బురద చల్లుతున్నారు..
2014 నుంచి ఇప్పటి వరకు, రాఘవ కన్‌స్ట్రక్షన్ అంశానికి సంబంధించి కూడా సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని ఇదే సభలో తాము ప్రకటించామన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులకు రాజకీయం కావాల ని, ధరణి పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టారన్నారు. తాను సీబీసీఐడీకి ఆదేశాలి చ్చిన వెంటనే హరీశ్ రావును.. నీ పుణ్య మా అని నా మీద విచారణకు వచ్చిందని కేటీఆర్, సంతోష్ రావు ప్రశ్నించారని ఎద్దేవా చేశారు.
హరీశ్ రావు తమ్ముడు మహేశ్ రావు మహబూబ్ నగర్‌లోని బాలానగర్‌లో వందల ఎకరాల భూమి అక్రమంగా ధరణిని అడ్డంపెట్టుకుని రాయించుకున్నారన్నారు. దానిపై రిపోర్టును కలెక్టర్‌కు మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి అడిగితే తన తమ్ముడు మహేశ్‌రావు, మా మామ హన్మంతరావు ఇందు లో ఉన్నారని, తనకు సహకరించాలని మంత్రిని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారన్నారు. ఇందుకు మంత్రి కుదరదు, దీనిపై నివేదిక తెప్పిస్తున్నామని అంటే అప్పటి నుంచి మంత్రి శ్రీనివాస్‌రెడ్డిని టార్గెట్ చేశారని పేర్కొన్నారు.
ప్రైవేట్ పరిశ్రమ యజమానులను బెదిరించి అక్రమంగా వాళ్ల తమ్ముడు, మామ, బావమరిది పేరు మీద భూము లు బదలాయించుకున్నారని, తాను నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నానన్నారు. హరీష్ రావు ఒప్పుకుంటే దీనిపై హౌస్ కమిటీ వేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు.




