30 March, 2026 | 2:54 AM

అధునాతన పద్ధతిలో వ్యవసాయ సాగు

30-03-2026 01:16 AM

డ్రోన్‌లతో నువ్వుల విత్తనాలు నాటే ప్రక్రియకు శ్రీకారం

అరగంటలోనే ఎకరం విత్తనాలు విత్తే ప్రక్రియ

ఆదిలాబాద్‌లో శాస్త్రవేత్తల ట్రయల్ రన్

ఆదిలాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): జిల్లాలో రైతులు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ వ్యవసాయ రంగంలో పంట సాగు చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన పద్ధతి సాగు విధానం కనిపిస్తోంది. రైతులు సాంకేతిక టెక్నాలజీని వాడుతూ... వీలైనంత వరకు వ్యవసాయ పెట్టుబడులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో రైతులు డ్రోన్ లను వినియోగిస్తూ.. విత్తనాలు నాటే ప్రక్రియ కు శ్రీకారం చుట్టారు. శాస్త్రవేత్త లు క్షేత్ర పరిశీలన చేస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు విత్తే ప్రక్రియ కోసం వినూత్నంగా ఆలో చించారు. పంట పొలాల్లో విత్తనాలు నాటడానికి కూలీల ఖర్చు, సమయం ఆదా చేసేందు కు అధునాతన సాంకేతికతను అందింపుచ్చుకుంటున్నారు. సాగులో డ్రోన్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. కాగా జిల్లాలో మొట్టమొదటి సారిగా విత్తనాలను నాటేందుకు ఈ డ్రోన్ ను వినియోగించారు. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్ పంట చేనులో ప్రయోగాత్మకంగా నువ్వుల విత్తనాలను ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డ్రోన్‌తో నాటించారు. దీంతో రైతులకు మేలు జరగనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దేశంలోనే తొలిసారిగా ఇలా...

దేశంలోనే తొలిసారిగా డ్రోన్ తో నువ్వుల విత్తనాల ప్రక్రియ ప్రారంభించారు. ఇందు కోసం డ్రోన్ కు కొన్ని మార్పులు కూడా చేశారు. వరుసకు వరుసకు మధ్య 30 సెం.మీ లు మొక్కకు మొక్కకు మధ్య 8 నుండి 10 సెం. మీలు దూరం వచ్చేలా డ్రోన్ కు మార్పులు చేసి దాని ద్వారా విత్తనాలు వేశారు. సాధారణంగా రైతులు ఒక ఎకరం వ్యవసాయ భూమిలో విత్తనాలు విత్తాలంటే కనీసం ఒక్కరోజైన పడుతుందని, కానీ ఇలా డ్రోన్ తో విత్తనాలను విత్తుకుంటే కేవలం అరగంటలో పూర్తయిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కాగా డ్రోన్‌తో విత్తనాలను  వేయడం దేశంలోనే ప్రథమమని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. మునిగెల రఘువీర్ పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విత్తనాలను వేయడం కోసం డ్రోన్లను కనుక వినియోగిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, కూలీల కొరత అధిగమించవచ్చని తెలిపారు.

అన్నదాతకు మేలు

దేశంలోనే తొలిసారిగా నువ్వుల విత్త నాలు డ్రోన్‌తో వేసే ప్రక్రియ ట్రయల్ ర న్ చేశాం. ఈ ప్రక్రియతో రైతులకు మేలు జరగనుంది. సంప్రదాయ పద్దతులతో పోలిస్తే ఇలా డ్రోన్ వినియోగంతో సాగు పనుల్లో సమయం, ఖర్చు తగ్గుతుంది. వ్యక్తిగతంగా కొనుగోలు చేసే శక్తి లేని రైతులకు ఇలాంటి ఆధునిక వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం రాయితీపై అందజే యాలని కోరారు.

డా.మునిగెల రఘువీర్, 

కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త