17 July, 2026 | 2:04 AM

పుష్కర ఘాట్లను పరిశీలించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

17-07-2026 02:03 AM

అర్మూర్, జులై 16 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద గల పుష్కర ఘాట్లను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పరిశీలించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న పుష్కర ఘాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా పుష్కర ఘాట్ల నిర్మాణ పరిస్థితులు, భక్తుల రాకపోకలకు అనువైన మార్గాలు, వాకింగ్ ట్రాక్లు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలు, హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించారు. 

సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశమున్నందున భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, తాత్కాలిక పోలీస్ సహాయ కేంద్రాలు, వైద్య శిబిరాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, అత్యవసర స్పందన బృందాల ఏర్పాటుపై ముందస్తు కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.  సీపీ వెంట  ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి,  ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్త్స్ర సుహాసిని, ఇరిగేషన్ శాఖ డి.ఈ. సురేష్, ఏ.ఈ.  సుశాంత్ కుమార్, వంశీ,   రెవెన్యూశాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.