19-02-2026 12:00:00 AM
నిజామాబాద్ ఫిబ్రవరి 18(జయ క్రాంతి): ‘ఇంట్లో ఈగల పోరు.. బయట పగల పోరు‘ అన్న చందంగా, ఈ మున్సిపల్ ఎన్నికలు కేవలం పార్టీల మధ్య పోరుగానేకాక, స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ వారసులు, స్వంత సోదరుల మధ్య ఆధిపత్య పోరుగా పతాక స్థాయికి చేరాయి. ఒకవైపు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తన చతురతతో ఇందూరు కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని అన్ని పావులూ కదిపారు. కానీ, ‘గోడకు కొట్టిన సున్నం‘ లా ఆయన ఆశలు అడియాశలయ్యాయి.
సొంత అన్న, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ రంగ ప్రవేశంతో కథ మొత్తం అడ్డం తిరిగిందనే వాదన వినిపిస్తుంది. రాజకీయాల్లో ‘రక్త సంబంధం కంటే పార్టీ బంధం, రాజకీయ వ్యూహాలే ముఖ్యం‘ అని ఈ సోదరుల మధ్య జరిగిన సవాళ్లు మరోసారి నిరూపించాయి. నిజానికి, బీజేపీ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అరవింద్ అన్నీ తానై నడిపించారు. ‘గుమ్మడికాయంత ఆశ.. ఆవగింజంత అదృష్టం‘ లేకపోయినా పర్లేదు, పక్కా ప్లాన్ ఉంటే చాలనుకున్నారు.
కానీ, సరిగ్గా అప్పుడే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ‘సమయానికి తగ్గ సంజయాస్త్రాన్ని‘ ప్రయోగించారు. కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతుల్లో ఉన్న సంజయ్ను అర్ధాంతరంగా పిలిపించి, ప్రచార రంగంలోకి దింపడం కాంగ్రెస్ చేసిన ’మాస్టర్ స్ట్రోక్’ అనే చెప్పొచ్చు. ‘పాత బియ్యం అన్నం రుచి‘ అన్నట్లుగా, నగరం తొలి మేయర్గా సంజయ్కు ఉన్న అనుభవం, ప్రతి గల్లీపై ఉన్న పట్టు కాంగ్రెస్కు వరంలా మారింది. ముఖ్యంగా మైనార్టీ ఓటర్లతో ఆయనకున్న సాన్నిహిత్యం చూసి, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
మీడియా, సభల్లో సంజయ్ ఏ మాత్రం సోదర ప్రేమ చూపించకుండా, ఎంపీ అరవింద్ ధర్మపురిపై ఘాటైన విమర్శలు చేశారు. సభల్లో ఎంపీ అరవింద్ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మైనార్టీ ఏరియాలో ఎంఐఎం హవాను తట్టుకుని, కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకోవడం అంటే, అది డి.సంజయ్ నడిపిన రాజకీయ చదరంగమే అనుకోవచ్చు. మరోవైపు సామాజిక సమీకరణాల్లో కూడా సంజయ్ చుక్కానిలా నిలిచారు. తన తండ్రి, దివంగత డీ. శ్రీనివాస్ మున్నూరు కాపుల సంక్షేమం కోసం చేసిన కృషిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.
స్వయంగా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉండటం, పద్మశాలీలతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఆయనకు కలిసొచ్చింది. బీజేపీ కేవలం హిందూ ఓట్ల ఏకీకరణపైనే ఆశలు పెట్టుకోగా, సంజయ్ మాత్రం ‘హిందూ-ముస్లిం భాయ్ భాయ్‘ అంటూ లౌకికవాద మంత్రాన్ని జపించి, హిందూ మెజారిటీ ప్రాంతాల్లో కూడా బీజేపీ ఓట్లకు గండి కొట్టారు. ఫలితంగా, బీజేపీ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేక ‘చేతికి అందివచ్చిన అన్నం... నోటికి అందలేదు‘ అన్న చందంగా మేయర్ పీఠం అందకుండా పోయింది.
ఒకవేళ సంజయ్ ఈ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనకపోయి ఉంటే, కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయ్యారయ్యేదని విశ్లేషకుల మాట. ఎంఐఎంకు ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే, వారు మేయర్ పీఠం కోసం పట్టుబట్టేవారు, అప్పుడు కాంగ్రెస్ బలహీనపడి,టీపీసీసీ అధ్యక్షులు ఇలాఖాలోని మేయర్ సీటు పతంగి పార్టీకి అప్పజెప్పాల్సి వచ్చేది. అదే సమయంలో హిందూ ప్రాంతాల్లో బీజేపీ మరింత పుంజుకునేది. కానీ, సంజయ్ ఎంట్రీతో ఆ ముప్పు తప్పింది.
‘మునిగిపోయే పడవను ఒడ్డుకు చేర్చినట్లు‘ కాంగ్రెస్ను నిలబెట్టి, మేయర్ పీఠంపై హస్తం జెండా ఎగిరేలా, ‘చేతి,‘కి చిక్కేలా చేశారు సంజయ్. దీంతో పెద్దాయన దివంగత డీఎస్ మాదిరి కాంగ్రెస్ పార్టీకి నగరంలో పెద్ద దిక్కుగా సంజయ్ మారారని హస్తం శ్రేణులు చెప్పుకోవడం విశేషం. మరోవైపు ఈ ఎన్నికల ఫలితం ఎంపీ అరవింద్కు నిరాశను మిగిల్చినా, మున్సిపల్ ఎన్నికల్లో లార్జెస్ట్ డిజిట్ పార్టీగా బీజేపీని నిలిపిన ఘనత మాత్రం దక్కించుకున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో స్వంత అన్నదమ్ముల పోరు కొత్తేమీ కాకపోయినా, నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఈ పోరు కొత్తగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే మాజీ మేయర్ సంజయ్ ను బరిలో దింపి, ఎంపీ అరవింద్ గెలుపుకు చెక్ పెడతారని బలంగా వినిపించింది. భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుందో చెప్పలేం. అయితే నామినేటెడ్ పదవుల పందేరం ముందున్న దృష్ట్యా, ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో, సంజయ్ చేసిన సేవలకు, కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి ’గిఫ్ట్’ ఇస్తుందో చూడాలి మరి.