31 May, 2026 | 12:40 AM

‘నీటి’ కటకట!

31-05-2026 12:00 AM
  1. అడుగంటిన భూగర్భజలాలు.. 
  2. అల్లాడుతున్న మేడ్చల్ జనం..
  3. రోడ్లపై పరుగులు తీస్తున్న ట్యాంకర్లు
  4. నీటి దందాతో ప్రజలపై అదనపు భారం
  5. అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా ఆగ్రహం

మేడ్చల్ అర్బన్, మే 30 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చ ల్ సర్కిల్ పరిధిలోని మేడ్చల్ పట్టణంలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రరూ పం దాల్చుతోంది.ఎండలు ముదరకముందే నీటి కోసం ప్రజలు తీవ్రంగా అల్లాడుతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ట్యాంకర్ల నీరే దిక్కవడంతో సామాన్యులపై భారీగా ఆర్థిక భారం పడుతోంది.పట్టణ ప్రజ లు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదని నీటి సరఫరా ను పెంచడం లేదంటూ స్థానికుల నుంచి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తు తం మేడ్చల్లో తాగునీటి ఎద్దడి ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

పదేళ్ల కిందటి దుస్థితి పునరావృతం..

ఒకప్పుడు మేడ్చల్లో భూగర్భ జల మట్టం తక్కువగా ఉండటంతో ప్రజలు నీటి కోసం ఎన్నో బాధలు పడ్డా రు. తర్వాత వచ్చిన మా ర్పులతో పరిస్థితి మెరుగైంది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’మిషన్ భగీరథ’పథకంతో నీటి కొరతకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఘనాపూర్ క్షేత్ర గిరి గుట్టపై నిర్మించిన మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా పట్టణానికి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేవారు.

అనంతరం డిమాండ్కు తగ్గట్టుగా నీటి సరఫరా జరగడంతో మునుపటి వేసవి కాలంలోనూ ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి రాలే దు. కానీ, దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా నీటి కష్టాలు మొదలయ్యాయి. మేడ్చల్ మున్సిపాలిటీ, జీహెచ్‌ఎంసీలో విలీనమైన తర్వాత కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవడం గమనార్హం.

డిమాండ్‌కు తగిన నీటి సరఫరా లేకే..

జలమండలి అధికారుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మేడ్చల్ పట్టణానికి రోజు వారీగా ఇవ్వాల్సిన 7.5 ఎంఎల్డీల నీటిని కాస్తా, కేవలం 3.5 ఎంఎల్డీలకు తగ్గించి సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు భూగర్భ జలా లు అడుగంటిపోవడంతో బోరు బావులన్నీ ఎండిపోయాయి. ఫలితంగా ప్రస్తుతం పట్టణంలో ఐదు రోజులకు ఒకసారి కొన్ని ప్రాంతాల్లో వారానికి రెండు సార్లు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు.

అది కూడా ఎలాంటి నిర్దిష్ట వేళాపాలా లేకుండా వదులుతుండటంతో ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. మేడ్చల్ పట్టణంలోని ఉమానగర్, బాలాజీనగర్, రాఘవేంద్రనగర్, గోకుల్నగర్, కేఎల్‌ఆర్ వెంచర్ మొదలైన ప్రధాన ప్రాంతాలతో పాటు పలు కాలనీల ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాంకర్ల ‘నీటి’ దందా.. సామాన్యుడిపై డబ్బుల మోత..

మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడం బోర్లు ఎండిపోవడంతో ఇదే అదను గా కొందరు నీటి వ్యాపారాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. మేడ్చల్ పట్టణంలో ఏ రోడ్డుపై చూసినా నీటి ట్యాంకర్లే దర్శనమిస్తున్నాయి. పట్టణంలో ఏ చౌరస్తాలో నిలబ డినా కేవలం 15 నిమిషాల్లో కనీసం 10 ట్యాంకర్లు తిరగడం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.పట్టణ ప్రజలు నీటి కొనుగోళ్ల వల్ల అదనంగా ఆర్థిక భారం పడుతోం ది. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల్లో నివసించే వారికి ట్యాంకర్ నీరు తప్పనిసరి అయింది.

తక్షణ చర్యలు చేపట్టాలి: స్థానికుల డిమాండ్..

ఎండకాలం కాకముందే నీటి కోసం ఇం తలా అల్లాడిపోతున్నామని, అధికారులు ఇప్పటికైనా స్పందించి మిషన్ భగీరథ నీటి సరఫరాను పెంచాలని, నీటి దందాను అరికట్టి మున్సిపాలిటీ నుండి ఉచితంగా లేదా సరసమైన ధరలకే నీటిని అందించాలని స్థానిక కాలనీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని పలు కాలనీలకు చెందిన ప్రజలు హెచ్చరిస్తున్నారు.