13 June, 2026 | 1:53 AM

బీఆర్‌ఎస్‌కు అధికార పక్షమే

13-06-2026 12:56 AM
  1. సీఎం రేవంత్ ఎమ్మెల్యేగా కూడా గెలవడు
  2. ఇప్పుడున్న హెలికాప్టర్ చాలదని నెలకు 5 కోట్ల ఖర్చుతో కొత్తది కొంటున్నడు
  3. 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నడు..
  4. రైతుబంధుకు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మాత్రం నిధులు ఉండవా!
  5. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాన్నది ప్రజల మాట 
  6. మాజీ మంత్రి హరీశ్‌రావు

జమ్మికుంట, జూన్ 12 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధికారపక్షంగా పాలన కొనసాగిస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవరని జోస్యం చెప్పారు. ఇప్పు డున్న హెలికాప్టర్ చాలదని నెలకు 5 కోట్ల ఖర్చుతో సీఎం రేవంత్ కొత్త హెలికాప్టర్ కొంటున్నాడని, ఫుట్‌బాల్ ఆటలకు, అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెట్టారని కానీ తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడానికి, రైతుబంధు ఇవ్వడానికి డబ్బులు ఉండవా అని నిలదీశారు. జూబ్లీహిల్స్‌లో ఆయనకున్న ప్యాలెస్ సరిపోదని 100 కోట్లతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టారని విమర్శించారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో శుక్రవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి   హిట్లర్ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనేది ప్రజల మాట అని చెప్పారు. కేసీఆర్ పాలనలో రైతులకు 24 గంటల కరెంటు, రైతుబంధు రైతు బీమా వంటి అనేక పథకాలను అందిస్తే, నేడు కాంగ్రెస్ పాలనలో 11 గంటలు కూడా కరెంట్ వస్తలేదని, పథకాలు అమలు కావడం లేదన్నారు.

రైతులకు రైతుబంధు, రైతుబీమా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్, అందాల పోటీలకు కోట్లు ఖర్చు  పెడుతున్నారని విమర్శించారు. ఇప్పుడున్న హెలికాప్టర్ చాలదన్నట్టు నెలకు 5 కోట్ల ఖర్చుతో సీఎం రేవంత్ కొత్త హెలికాప్టర్ కొంటున్నాడని చెప్పారు. ప్రజలకు కాంగ్రెస్ పాలన తీరు అర్థమయిందని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అంటున్నారని చెప్పారు.

బీఆర్‌ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధికారపక్షంగా పాలన కొనసాగిస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవరని జోస్యం చెప్పారు. కేసీఆర్ సీఎం అయిన వెంటనే హు జూరాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకొని అభివృద్ధి చేస్తామన్నారు. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, కార్యకర్తలు ఐక్యత గా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2004 నుంచి ఇప్పటివరకు ఒక్క ఉపఎన్నిక తప్ప ఏ ఎన్నిక వచ్చినా గులాబీజెండా ఎగిరిందన్నారు. 

హామీలను విస్మరించారు

కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో పథకాలను తెస్తే రేవంత్‌రెడ్డి ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చి, హామీలను విస్మరించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కృతజ్ఞతకు, ఆశకు జరిగిన పోరాటంలో రేవంత్‌రెడ్డి పెట్టిన ఆశల వలయంలో ప్రజలు చిక్కుకున్నారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రైతు వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్‌కు ముద్రపడిందని, ఆ పార్టీకి ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు.

కేసీఆర్ హయాంలో కరోనా వచ్చినా రైతుబంధు ఆగలేదని, 11 సార్లు 74 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేసిన దేశంలోనే ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి వచ్చాక రైతు బంధు మొత్తం ఎగ్గొట్టాడని, ఈసారి 2 ఎకరాలకే ఇచ్చారని పేర్కొన్నారు. 20 వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ చేశామంటూ అబద్ధాలు చెపుతున్నారని దుయ్యబట్టారు. రైతుబీమా బంద్ అయ్యిందని, ఎల్‌ఐసీకి బీమా సొమ్ము కాంగ్రెస్ చెల్లించడం లేదన్నారు.

రేవంత్‌రెడ్డి పాలనలో రైతులకు ఎరువుల కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. తరుగు లేకుండా వడ్లు కొంటలేరని ఆరోపించారు. రైతు డిస్కం పేరిట 24 గంటల కరెంట్‌కు రేవంత్‌రెడ్డి ఉరేస్తున్నాడని విమర్శించారు. రైతు డిస్కం అమలు లోకి వస్తే ఇప్పుడొచ్చే 11 గంటలు కూడా రైతులకు కరెంట్ రాదని, 5, 6 గంటలు మాత్రమే వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

100 కోట్లతో సీఎం రేవంత్ క్యాంప్ ఆఫీస్ 

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగ్గొట్టారని, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తానని మోసం చేశారని, రూ.2500 ఇస్తానని మహిళలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని హరీశ్‌రావు విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో ఆయనకున్న ప్యాలెస్ సరిపోదని 100 కోట్లతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టారని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ అని పెట్టి అక్కడ మరో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టారని విమర్శించారు. రేవంత్ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని చెప్పారు.

దేశంలో సీఎంలు ఓడిపోయే ట్రెండ్ నడుస్తున్నదని, బెంగాల్, తమిళనాడులో అదే జరిగిందని తెలంగాణలోనూ అదే రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. కాగా హుజూర్‌నగర్‌లో డంపింగ్ యార్డ్ సమస్య వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ తరఫున గళమెత్తుతామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అయినా ఇప్పటి వరకు మేడిగడ్డ మరమ్మతులు చేపట్టలేనద్నారు. రాష్ట్రంలో వాయు కాలుష్యం లాగా రేవంత్‌రెడ్డి బూతులతో ధ్వని కాలుష్యం నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, కరీంనగర్ అధ్యక్షుడు జీవి రామకృష్ణ, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బండ శ్రీనివాస్, మాజీ సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తక్కల్లపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.