నీటి వనరుల సంరక్షణే ప్రధాన లక్ష్యం
హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఉప్పల్ జులై 16 (విజయక్రాంతి): నీటి వనరులను సంరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. నాచారం సర్కిల్ పరిధిలోని హెచ్‌ఎంటీ నగర్ చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం నాడు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు చెరువు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.
హైడ్రా ఆధ్వర్యంలో సుమారు 108 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హెచ్‌ఎంటీ నగర్ చెరువును పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. చెరువులో పేరుకుపోయిన పూడిక, కలుషిత పదార్థాలను తొలగించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. హెచ్‌ఎండీఏ నిధులతో అమలవుతున్న ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఆదర్శప్రాయమైన చెరువు అభివృద్ధి నమూనాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పునరుద్ధరణ పనులు పూర్తయిన అనంతరం పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు వేసవి కాలంలో నీటి కొరత సమస్య తగ్గే అవకాశముందని అధికారులు తెలిపారు. అదేవిధంగా భారీ వర్షాల సమయంలో వరద ముప్పును తగ్గించడంలో కూడా ఈ చెరువు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. చెరువు పరిధిలో పట్టా భూములు కలిగిన వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం టిడిఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) పొందే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు నీటి వనరులను సంరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హైడ్రా అధికారులు వెల్లడించారు.






