‘ధరల’ దోపిడీ..!
- రైతులను దోచుకుంటున్న ఎరువుల వ్యాపారులు
- మరోవైపు ఊపందుకుంటున్న ఖరీఫ్ సాగు పనులు
- సింగిల్ విండోలు, ప్రైవేటు దుకాణాల్లో యథేచ్ఛగా అదనపు వసూళ్లు
- పాత స్టాక్‌కూ కొత్త ధరల దెబ్బ
- రసీదులు ఇవ్వకుండానే విక్రయాలు
- సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్నదాతల ఆవేదన
- పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు
సంగారెడ్డి, జూన్ 12 (విజయక్రాంతి): జిల్లాలో వానాకాలం (ఖరీఫ్) సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో అన్నదాతలపై ఎరువుల ’ధరల’ భారం పిడుగులా పడింది. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగగా, దానిని ఆసరాగా చేసుకుని జిల్లాలోని కొందరు ప్రైవేట్ డీలర్లు, విక్రయదారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.
నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధరకే ఎరువులు విక్రయించాల్సి ఉన్నా, క్షేత్రస్థాయిలో మాత్రం దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ప్రతి బస్తాపై రూ. 150 నుంచి రూ. 300 వరకు అదనంగా వసూలు చేస్తూ సంగారెడ్డి జిల్లా రైతు రెక్కల కష్టాన్ని నట్టేట ముంచుతున్నారు.
పాత స్టాక్‌కూ కొత్త ధరల జిమ్మిక్కు...
గత యాసంగి సీజన్ ముగిసే సమయానికి వ్యాపారుల వద్ద, పీఏసీఎస్ గోదాముల్లో నిల్వ ఉన్న పాత స్టాక్ ఎరువుల బస్తాలపై పాత ధరలే ముద్రించి ఉన్నాయి. అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే ధరలు పెరిగాయనే నెపంతో ఆ పాత నిల్వలను సైతం పెంచిన ధరలకే విక్రయిస్తున్నారు. ప్రభుత్వం యూరియా బస్తా ధరను రూ. 266.50 గా నిర్ణయించింది. అయితే డిమాండ్ ఉన్న సమయంలో యూరియా కావాలంటే దానితో పాటు కచ్చితంగా ఏదో ఒక అవసరం లేని లిక్విడ్ లేదా కాంప్లెక్స్ ఎరువుల బస్తాను కొనాలంటూ డీలర్లు మెలిక పెడుతున్నారు.
కాంప్లెక్స్ ధరల మోత..
కాంప్లెక్స్ ధరలు మోత మోగిస్తున్నాయి. 20:20:0:13 బస్తాపై, అలాగే 10:26:26 వంటి కాంప్లెక్స్ ఎరువులపై ఒక్కో బస్తాకు రూ. 300 పైనే అదనపు భారం పడుతోంది. సదాశివపేట, నారాయణఖేడ్, పటాన్చెరు, జహీరాబాద్ ప్రాంతాల్లోని పలు ప్రైవేట్ కేంద్రాల్లో ఈ దోపిడీ మరీ ఎక్కువగా ఉందని రైతులు వాపోతున్నారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా పీఓఎస్ మిషన్ ద్వారా రసీదు ఇవ్వాలి.
కానీ జిల్లాలోని మెజారిటీ దుకాణాల్లో అదనపు ధరలు వసూలు చేస్తున్న కారణంగా రైతులకు ఎలాంటి బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లు అడిగితే ‘స్టాక్ లేదు.. పక్క దుకాణానికి వెళ్ళండి‘ అంటూ మొండి సమాధానాలు ఇస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్న రైతులు, అడిగినంత ఇచ్చి ఎరువుల బస్తాలను తీసుకెళ్తున్నారు.
కంటితుడుపు తనిఖీలు..
సీజన్ ప్రారంభానికి ముందే నకిలీ విత్తనాలు, ఎరువుల బ్లాక్ మార్క్పె నిఘా పెడతామని జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ప్రకటించినా, క్షేత్రస్థాయిలో ఆ నిఘా ఎక్కడా కనిపించడం లేదు. టాస్క్ఫోర్స్ తనిఖీలు కేవలం పట్టణ కేంద్రాలకే పరిమితమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని సబ్-డీలర్ల వద్ద సాగుతున్న ధరల దందాను అధికారులు అసలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లాలోని అన్ని ఫెర్టిలైజర్ షాపుల ముందు ఎరువుల నిల్వలు, వాటి ధరల పట్టికను కచ్చితంగా ప్రదర్శించాలి. ప్రతీ కొనుగోలుకూ పీఓఎస్ బిల్లు ఇచ్చేలా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించి, అదనపు ధరలకు విక్రయించే డీలర్ల లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.






