30 July, 2026 | 7:45 PM

25 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా చండూరు అభివృద్ధి

30-07-2026 06:51 PM

- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి):  రాబోయే 25 ఏళ్లలో పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని చండూరు మున్సిపాలిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించి అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలను పరిశీలించారు. జంగాల కాలనీలో స్థానికులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 10 కొత్త గ్రౌండ్‌లెవల్‌ నీటి ట్యాంకులు నిర్మించడంతోపాటు నిరుపయోగంగా ఉన్న మరో 10 ట్యాంకులను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

పీహెచ్‌సీకి కొత్త భవనం అవసరం

స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే.. పాత భవనాన్ని తొలగించి అదే స్థలంలో నూతన భవనం నిర్మించాలని సూచించారు. అక్కడి యునాని విభాగాన్ని కూడా పరిశీలించారు. యునాని వైద్యం గురించి వైద్యురాలు సౌజన్య వివరించడంతో ఎమ్మెల్యే అక్కడే కొన్ని మందులు తీసుకున్నారు. యునాని వైద్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.

రహదారి లేకుండా మున్సిపల్ కార్యాలయం ఎలా?

నిర్మాణంలో ఉన్న నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. భవనానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారి సౌకర్యం లేని చోట కార్యాలయం నిర్మించడం సరికాదని పేర్కొన్నారు. సుమారు ఎకరం స్థలంలో ఆధునిక సౌకర్యాలతో నూతన కార్యాలయాన్ని నిర్మించేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

మార్కెట్‌యార్డు లేదా దేవాదాయశాఖకు చెందిన స్థలాల్లో అనువైన స్థలాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ విషయమై మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ శ్రీదేవితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాన్ని ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చని ఆమె హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

అంతర్గత రహదారులు, డ్రైనేజీపై దృష్టి

చండూరు పట్టణంలోని ప్రధాన రహదారిని అభివృద్ధి చేసిన నేపథ్యంలో వార్డుల్లోని అంతర్గత రహదారులు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులు సమగ్ర ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేస్తే అవసరమైన పరిపాలనా, ఆర్థిక అనుమతులతోపాటు నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నిరుపేదలకు ఇళ్ల స్థలాలపై ఆదేశం

మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డులో సుమారు 20 మంది నిరుపేదలను గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కోడి శ్రీనివాసులు, వైస్‌ చైర్మన్‌ బూతరాజు దశరథ, కౌన్సిలర్లు, కమిషనర్‌ మల్లేశం, డీఈ మనోహర్‌ తదితరులు ఉన్నారు.