ఉప్పల్‌లో అభివృద్ధి జలపాతం
రూ.76.46 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు
ఉప్పల్,(విజయక్రాంతి): ప్రజా పాలన అంటేనే అభివృద్ధికి చిరునామా అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో రూ.76.46 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు అప్పులు చెల్లిస్తూనే మరోవైపు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.ఉప్పల్, వెంకట్‌రెడ్డినగర్, బీరప్పగడ్డ, చిలుకానగర్, కుషాయిగూడ, చర్లపల్లి, వంపుగూడ, కాప్రా డివిజన్లలో సీసీ రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, కల్వర్టులు, ఫుట్‌పాత్‌లు, మల్టీ స్పోర్ట్స్ అరేనా, జిమ్ పరికరాలు, శ్మశానవాటికల అభివృద్ధి వంటి పలు పనులకు శ్రీకారం చుట్టారు.
ముఖ్యంగా ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో వరద సమస్యల పరిష్కారానికి భారీ స్థాయిలో వర్షపు నీటి కాలువల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.ప్రతి కాలనీలో మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య వసతులు, డ్రైనేజీ వ్యవస్థలు కల్పించి ఉప్పల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని డివిజన్ల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






