21 May, 2026 | 3:29 AM

పక్కా ఓటర్ల జాబితా తయారీయే లక్ష్యం కావాలి

21-05-2026 01:55 AM

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, మే 20 (విజయక్రాంతి): ఎలాంటి తప్పులు లేని, అత్యంత పారదర్శకమైన పక్కా ఓటర్ల జాబితాను రూపొందించడమే జిల్లా యంత్రాంగం, రాజకీయ పార్టీల ముఖ్య లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ వీసీ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లా యంత్రాంగం అత్యంత పారదర్శకంగా, ఖచ్చితమైన విచారణతో బాధ్యతాయుతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేయాలని కలెక్టర్ సూచించారు.

ఇందుకోసం ప్రతి రాజకీయ పార్టీ తక్షణమే తమ బూత్ స్థాయి ఏజెంట్లను  నియమించుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్య బలోపేతంలో భాగస్వాములు కావాలని, అధికారులతో రాజకీయ నాయకులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్ 15నుండి ప్రారంభం అవుతుందన్నారు.

జూన్ 15 నుండి 24 వరకు బూత్ స్థాయి అధికారులకు పూర్తిస్థాయి శిక్షణ, ప్రిపరేషన్, ప్రింటింగ్ జూన్ 25 నుండి జూలై 24వ తేదీ వరకు బిఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర విచారణ చేస్తారన్నారు.  జూలై 24 న పోలింగ్ కేంద్రాలను ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించి, జూలై 31న ఓటర్ల ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు.

అలాగే జూలై 31 నుండి ఆగస్టు 30వ తేదీ వరకు ముసాయిదాపై అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ, జులై, 31 నుండి సెప్టెంబర్, 28 వరకు అభ్యంతరముల పరిష్కారం చేయబడుతుందన్నారు. అక్టోబర్, 1న ఓటర్ల తుది జాబితా అధికారిక ప్రచురణ చేయడం జరుగుతుందన్నారు. ఈ మొత్తం ప్రక్రియలో బీఎల్‌ఓల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు నమోదు ప్రక్రియలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి హరి సింగ్, రాజకీయ పార్టీల నుండి చెక్కిలం రాజేశ్వర రావు, ఎం డి అజిద్, వి.రవి, కె కరుణాకర్ ఎలక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.