ఘోస్ట్ సిమ్‌ల సీజ్
- సైబర్ నేరగాళ్లపై ఆపరేషన్ ఆక్టోపస్ 3.0
- 66 మంది నిందితుల అరెస్ట్
- 544 ఫేక్ సిమ్ కార్డులు..
- వాటితో 101 కోట్ల సైబర్ మోసాలు
- నిందితుల్లో పలు సిమ్ కార్డుల ఏజెంట్లు
- 18 బృందాలతో 13 రాష్ట్రాల్లో పోలీసుల దాడులు
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడి
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లకు సిమ్‌కార్డులను అందజేస్తున్న 66 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. మొత్తం 1,194 ఘోస్ట్ సిమ్ కార్డుల ను గుర్తించిన పోలీసులు.. వాటిలో 544 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్‌కార్డులతో నిందితులు దేశవ్యాప్తం గా రూ.101.87 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడినట్టు తెలిసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ బుధవారం ఈ వివరాలను వెల్లడించారు.
ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 పేరు తో 13 రాష్ట్రాల్లో 18 బృందాలతో పోలీసులు దాడులుచేశారని తెలిపారు. ఏడు రోజుల పాటు నిరంతరాయంగా సాగిన ఈ సోదాల్లో మొత్తం 66 మంది నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. వారి నుంచి 544 ఘోస్ట్ సిమ్ కార్డులను స్వాధీ నం చేసుకున్నట్టు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సిమ్ కార్డులలో 432 కార్డులు ఇంకా యాక్టివేట్ కాలేదన్నారు. ఇవన్నీ సీల్ చేసి, సైబర్ నేరగాళ్లకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంచారని తెలిపారు.
అరెస్ట్ అయిన వారిలో 44 మంది ఘోస్ట్ సిమ్ హోల్డర్లు ఉన్నారని, వీరితో పాటు 20 మంది టెలికాం పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) ఏజెంట్లు, ఇద్దరు సిమ్ కార్డుల సరఫరాదారులు ఉన్నారని చెప్పారు. పీఓఎస్ ఏజెంట్లలో వీఐకు చెందిన వారు 10 మంది, ఎయిర్‌టెల్‌కు చెందిన వారు ఏడుగురు, జియో సంస్థకు చెందిన వారు ముగ్గురు ఉన్నారని వెల్లడించారు. వీరంతా సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి.. సిమ్ కార్డులను అందజేశారని పేర్కొన్నారు.
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ఈ-కేవైసీ ప్రక్రియ సమయంలో వినియోగదారులకు తెలియకుండా అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేశారని సీపీ సజ్జనార్ తెలిపారు. వాటిని ఈ-సిమ్‌లుగా మార్చి విదేశాలకు తరలించారని చెప్పారు. డిజిటల్ పరిజ్ఞానం లేని అమాయకులకు ఉచిత సిమ్ కార్డులంటూ ఆశ చూపి, వారి పేర్లపైనా సిమ్‌లు తీసుకున్నారని వెల్లడించారు. కొంతమందికి డబ్బులు ఆశచూపి సిమ్ కార్డులను సేకరించారని చెప్పారు.
ఈ విధంగా యాక్టివేట్ అయిన సిమ్ కార్డులు విదేశాల్లోని సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్తున్నాయని, వీటి ద్వారా దేశంలోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా ఈ దాడులు ప్రారంభించినట్టు పేర్కొన్నారు.
తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి, నిందితులను పట్టుకున్నట్టు తెలిపారు. నిందితుల వద్ద 1,194 ఘోస్ట్ సిమ్‌లను గుర్తించినట్టు తెలిపారు. పట్టుబడిన నిందితులకు దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నదని సీపీ సజ్జనార్ వెల్లడించారు.






