21 May, 2026 | 2:15 AM

విచారణకు నా కొడుకుని నేనే అప్పగించా!

21-05-2026 01:13 AM
  1. పార్టీ పెట్టే ఫాల్తు ఆలోచనలు లేవు
  2. నా శవంపై కాషాయ జెండా కప్పాల్సిందే..
  3. కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): తన కొడుకుపై ఆరోపణలు వస్తే, తనకు సమాచారం వచ్చిన వెంటనే పోలీసులకు అప్పగించానని.. ఏ తండ్రైనా తన కన్న కొడుకును ఇప్పటివరకు ఇలా అప్పగించారా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఉరిశిక్ష వేసే ముందు మీ చివరి కోరిక ఏమిటని బీజేపీలో కమిట్‌మెంట్‌తో పనిచేసే ఏ  కార్యకర్తను అడిగినా చెప్పేది ఒక్కటే.. తాను చచ్చిపోయాక శవంపై కాషాయ జెండా కప్పాలని అడుగుతారని, తనది కూడా అదే చివరి కోరిక అని ఆయన చెప్పారు.

తను కొత్త పార్టీ పెడుతున్నానని కొందరు ఫాల్తుగాళ్లు ప్రచారం చేస్తున్నారని, తను అలాంటి రాజకీ య నాయకుణ్ని కాదని, కమిట్‌మెంట్‌తో పనిచేసే కార్యకర్తగా అట్లాంటి వాటికి స్పందించాల్సిన అవసరం తనకు లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. తన బర్తరఫ్, అరెస్టుపై కేటీ ఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీని నడుపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చొని బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలంటున్నారని, కేసీఆర్‌ను గద్దె దించాం కాబట్టి కేసీఆర్‌కు ఆ కసి ఉందన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బండి సంజయ్ బుధవారం వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ‘సంజయ్ ఆప్ సంఘర్ష్ కరో.. హమ్ తుమ్హారే సాథ్ హై’ అంటూ నినదించారు. అనంతరం వారు బండి సంజయ్‌ను కలిసి సంఘీభావం ప్రకటిస్తూ పెద్దఎత్తున సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.

ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ సీనియర్ నేతలు డాక్టర్ మనోహర్ రెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.  ‘బండి సంజయ్ అంటే ఏమిటో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసు.. కార్యకర్తలందరికీ తెలుసు. ఫాల్తుగాళ్లు చేసే ప్రచారానికి స్పందించాల్సిన అవసరమే లేదు. బీజేపీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో ఎంతో మంది కార్యకర్తలను తయారుచేసిన వ్యక్తులం మేం.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు 17 ఎంపీ సీట్లున్నాయి కదా? ఆయన భాగస్వామ్యంతోనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందా?, బహుశా నన్ను బర్త్ఫ్ చేయాలనే నిర్ణయం కేసీఆర్, ఆయన కొడుకే తీసుకున్న ట్టున్నారు’ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కొడుకు విసిరే చిల్లర మెతుకులకు ఆశపడి ఒకట్రొండు ఛానళ్లు తనను అరెస్టు చేస్తారనే కథనాలను ప్రసారం చేస్తున్నాయని, అది చూసి కేసీఆర్ కొడుకు రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు.

‘వాళ్ల దృష్టిలో చూస్తే నన్ను అరెస్టు చేయాల్సిందేమో. ఎందుకంటే.. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ గడీల పాలనను బద్దలు కొట్టినం కదా? పదేళ్ల కేసీఆర్ కుటుంబ అవినీతి అరాచక పాలనను బొందపెట్టినం కదా? అధికారం పోయిందనే కోపం వాళ్లకుంటది కదా? అందుకే నన్ను అరెస్ట్ చేయించాలని చూస్తున్నరేమో’ అని ఆయన సమాధానమిచ్చారు.

‘నేను ప్రజల మధ్య ఉన్నాను కాబట్టే, ప్రజలు బీజేపీతో ఉన్నారు కాబట్టే.. నన్ను, నా పార్టీని బదనాం చేసేందుకు కేసీఆర్ కొడుకు సోషల్ మీడియాలో ఇట్లాంటి విష ప్రచారం చేయిస్తున్నాడు’ అని మండిపడ్డారు. ఎన్ని వండి వార్చినా జనం బీజేపీతోనే ఉన్నారని, ఫేక్ వార్తలను, ఫేక్ స్టోరీలను చూసి జనం నవ్వుకుంటున్నారని బండి సంజయ్ తెలిపారు.