20 May, 2026 | 4:52 AM

పాలమూరు ప్రజలు బీఆర్‌ఎస్‌ను నమ్మరు

20-05-2026 12:00 AM

పదేళ్లు అధికారంలో ఉండి ‘పాలమూరు - రంగారెడ్డి’ని ఎందుకు పూర్తి చేయలేదు

మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి  

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు పెట్టినా పాలమూరు జిల్లా ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని నమ్మరని మం త్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పాలమూరు జ్లిలాను కేసీఆర్ తీవ్ర నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెకులే ఉన్నాయని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను బీఆర్ ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టిందని విమర్శించారు.

పాలమూరు పైన కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపించాడని మంత్రులు మండిపడ్డారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పాదయాత్ర చేస్తామని బీఆర్‌ఎస్ నేతలు చేసిన ప్రకటనలపై మంత్రులు స్పందించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని పూర్తి చేస్తామన్న నాటి బీఆర్‌ఎస్..

పదేళ్లు అధికారంలో ఉండి కేవలం  పంపులు, మోటార్ల కోసం రూ. 35 వేల కోట్లు కేటాయించి,  అందులో  కేవలం రూ. 25 వేలు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి జూపల్లి తెలిపారు. కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్  ప్రాజెక్టులకు కాంగ్రెస్ హయాంలోనే  రూ.8,500 కోట్ల ఖర్చు చేశామని, బీఆర్‌ఎస్ హయాంలో కేవలం రూ. 6300 కోట్లు మాత్రమే  ఖర్చు చేశారని ఆరోపించారు. 

మల్లన్న సాగర్‌ను 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన కేసీఆర్.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆ స్థాయి రిజర్వాయర్లను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 6 టీఎంసీలు మాత్రమేనని, కానీ పదేళ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు తెలంగాణకు చాలని కేసీఆర్, హరీష్‌రావు సంతకాలు పెట్టి వచ్చారని, మా ప్రభుత్వం 62 శాతం అంటే 560 టీఎంసీలపైన హక్కు ఉం దని వాదిస్తోందన్నారు. పోతిరెడ్డి పాడు నుంచి ఆం ధ్రా వేల టీఎంసీల నీళ్లను తీసుకుపోయిందన్నారు. 

50 శాతం కూడా ఖర్చు చేయలేదు

బీఆర్‌ఎస్ నాయకుల పోరుబాటను ప్రజలెవ్వ రూ నమ్మరని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. పాలమూరు తర్వాత మొదలైన కాళేశ్వరాన్ని ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు. ఒక్క మోటార్ బటన్ నొక్కితే పాలమూరు ప్రారంభమైనట్లా? అని నిలదీశారు.  అంచనా వ్యయంలో కనీ సం యాబై శాతం కూడా ఖర్చు పెట్టలేదని మంత్రి శ్రీహరి పేర్కొన్నారు.