23 April, 2026 | 1:57 AM

పరిషత్ పోరు..ప్రధాన పార్టీలు సిద్ధం!

23-04-2026 12:09 AM
  1. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చ 
  2. నేటి కేబినెట్ భేటీలో చర్చిస్తారని చర్చ..
  3. వచ్చే నెలలో ఎన్నికలు ఉంటాయని ఊహాగానాలు
  4. మెదక్ జిల్లాలో 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలు
  5. ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు..

మెదక్, ఏప్రిల్ 22(విజయ క్రాంతి) : స్థానిక సంస్థల్లో కీలకమైన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక అందరి దృష్టి ప్రాదేశిక పోరుపైకి మళ్లింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉందన్న సంకేతాలతో జిల్లాలోని ప్రధాన పార్టీలు పోరుకు సన్నద్ధమతున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మెదక్ లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ల పీఠాలను దక్కించుకుంది. పంచాయతీ ఎన్నికల్లో సైతం ప్రధాన పార్టీల నుంచి సర్పంచ్లు, ఉప సర్పంచ్లుగా గెలుపొందారు.

రాష్ట్ర స్థాయిలో అత్యధికులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో ఈ ఎన్నికల్లోనూ ప్రజలు తమ పార్టీనే ఆదరిస్తారనే భావనతో ప్రభుత్వం మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు భావిస్తున్నారు. కానీ పంచాయతీ ఎన్నికలకంటే ముందే పరిషత్ ఎన్నికలకు సిద్ధమైనా రిజర్వేషన్ల విషయంలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో నాటి నోటిఫికేషన్ ను సుప్రీంకోర్టు నిలిపి వేసింది. దీంతో 50 శాతం సీట్లు బీసీలకు పంచాయతీ, మున్సిపల్ రిజర్వేషన్ల పద్ధతిలోనే మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించి తద్వారా లబ్ధి పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

 జిల్లాలో 190 ఎంపీటీసీ స్థానాలు... 

మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 190 ఎంపీటీసీ, 21 జడ్పీటీసీ, 21ఎంపీపీ స్థానాలున్నాయి. గతంలో రిజర్వేషన్ల ప్రక్రియలో అధికంగా బీసీలకు కేటాయించడంతో జనరల్ స్థానాలు తగ్గాయి. కానీ రిజర్వేషన్ల మార్పులో బీసీ రిజర్వుడ్ సీట్లు తగ్గించి 50శాతం లోపు రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉండేలా మళ్లీ నిర్ణయం తీసుకోనుంది. మిగిలిన 50శాతం జనరల్కు కేటాయించడం ద్వారా జనరల్ స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు పోటీ చేసే అవకాశం లభించనుంది. ఈ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని 50శాతం రిజర్వేషన్ సుప్రీం కోర్టు ఆదేశాలు పాటిస్తూ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది.

 గడువు ముగిసి 22 నెలలు.. 

మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థానాలకు గడువు ముగిసి 22నెలలకు పైగా అయ్యింది. జిల్లాలో 2019  మే నెలలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. ఆ సంవత్సరం జూన్ 4 న ఫలితాలు విడుదల అయ్యాయి. కొలువుదీరిన పాలక వర్గం గడువు 2024 జూన్ తో ముగిసింది. 

 నేడు తుది ఓటరు జాబితా... 

రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 23వరకు తుది ఓటరు జాబితా సిద్ధం చేసుకోవాలని, మే నెలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పల్లెల్లో ఒక్కసారిగా రాజకీయాలు వెడ్డెక్కాయి. ఆశావహులు సీట్ల కోసం మంత్రులు,  ఎమ్మెల్యేలు, ఆయా రాజకీయ పార్టీల్లోని ప్రధాన నాయకులతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అనుచరులను సమాయత్తం చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం రిజర్వేషన్ల వ్యవహారం తేలాకే నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపధ్యంలో గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుండగా ఈ సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చ జరగనుందని సమాచారం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరీ.

ఆశావహుల ప్రయత్నాలు.. 

త్వరలోనే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న నేపథ్యంలో పోటీలో ఉండే ఆశవహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. నాయకుల దృష్టిలో పడి ఎలాగైనా టికెట్ తెచ్చుకొని పోటీలో ఉండి గెలుపొందాలని ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల్లో సైతం ఓటర్లను ప్రసన్నం చేసుకునే యత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే గతంలో పదవులు అనుభవించిన వారు ప్రయత్నాలు చేస్తుండగా కొత్తవారు సైతం తాము పోటీలో ఉంటామని చెబుతున్నారు.

మొత్తానికి అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చి ఎన్నికలు మొదలైతే గ్రామాల్లో సందడి మొదలు కానుంది. కాగా జిల్లాలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు వ్యవహరించిన తీరుపై పరిషత్ ఎన్నికల్లో ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.