2 July, 2026 | 2:57 AM

చర్చకు రెడీ

02-07-2026 01:33 AM

టైం, ప్లేస్ డిసైడ్ చేయండి.. ఎవరొస్తారో రండి

  1. మీ వైఫల్యాలు నిరూపించడంలో విఫలమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా 
  2. అబద్ధాలు ఆడటం రేవంత్‌రెడ్డికి జన్మహక్కు
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా? అని సీఎం రేవంత్‌రెడ్డి రైతుభరోసా నిధుల విడుదల సందర్భంగా విసిరిన సవాల్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నానని, ఏ అంశంపైనైనా తాను చర్చకు సిద్ధమని ప్రక టించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, రైతన్నల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం.. దేనిపై చర్చిద్దాం? తేదీ, డేట్, సమయం ఫిక్స్ చేయండి.

అసెంబ్లీనా?, ప్రెస్‌క్లబ్‌లోనా?, జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లోనా?, ఎక్కడైనా నేను రెడీ అన్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్ చౌరస్తానా?, 2 లక్షల ఉద్యోగాలు అని రాహుల్‌గాంధీ డైలాగులు కొట్టిన అశోక్‌నగర్ చౌరస్తానా?.. మీరొస్తారా, రాహుల్‌గాంధీ వస్తారా? ఇద్దరిలో ఎవరొస్తారో రండి.. అని సవాల్ చేశారు. మీ తప్పులను గణాంకాలతో సహా బయటపెడతామని, మీ పాలనా వైఫల్యాలను ఎండగట్టకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాని స్పష్టం చేశారు.

పరిపాలన చేతగాక బీఆర్‌ఎస్‌పై ఎన్ని రోజులు ఏడుపులు? అని మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎం అబద్ధాలు చెప్పడంలో కూడా పొంతన లేదని, కాగ్ లెక్కలు నమ్మాలా? కాకి లెక్కలు నమ్మాలా? అని ఎద్దేవా చేశారు. సీఎం, కుటుంబ సభ్యుల దోపిడీతో రాష్ట్రం ఆస్తులు కోల్పోతుందని, దండుపాళ్యం ముఠాలా కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్‌బంధు, పొంగులే టి బంధు, సోదరులు బంధు.. బంద్ చేయాలని ఎద్దేవా చేశారు. అబద్ధాలు ఆడటం రేవంత్‌రెడ్డికి జన్మహక్కు అని, ఈసారి ఆయనకు ప్రతిపక్ష పాత్ర కూడా మిగలదన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 

ఇజ్జత్ లేదంటూనే ఢిల్లీకి..    

రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని, ఎంత దివాలాకోరు మనిషి అయినా, నేను దివాలా తీశానని చెప్పి, మెడలో బోర్డు వేసుకొని తిరగరని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకసారి దివాలా అంటాడు, మరోసారి ఎయిడ్స్ రోగి అంటాడు, మరోసారి క్యాన్సర్ పేషెంట్ అంటాడు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం గురించి ఇంత నీచంగా మాట్లాడే ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరని మండిపడ్డారు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. 72 సార్లు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. 

నిజంగానే రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వచ్చే రెండున్నర  ఏళ్లు ఢిల్లీకి వెళ్లకుండా తెలంగాణలోనే ఉండి పరిపాలన చేసి, నిబద్ధత చాటుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం ఏమాత్రం కాదని, కేసీఆర్ సారధ్యంలో  కోటి ఎకరాల మాగాణ అయ్యిందని గుర్తు చేశారు.  రేవంత్ దొంగ కాబట్టే, అతన్ని చూడగానే  దొంగ వచ్చాడని అనుకోవడంలో తప్పు లేదని ఎద్దేవా చేశారు.

కేంద్రం సహకరించకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయామన్నారు. కేసీఆర్ మాత్రమే తెలంగాణ నా సొంత రాష్ట్రం, సాధించి పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం అన్న నిబద్ధతతో పని చేశారని, అందుకే ఇంత అద్భుతంగా రాష్ట్ర ం అభివృద్ధి చెందిందని చెప్పారు. 

తీవ్రమైన సంక్షోభంలో రైతాంగం..

ఎంతసేపు అప్పుల పేరుతో రేవంత్ రెడ్డి అబద్ధా లు చెబుతున్నారని, కానీ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ అప్పులు కేవలం రూ.2.70 లక్షల కోట్లు మాత్రమే అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రాన్ని పట్టుకొని దివాలా తీసిన రాష్ట్రంగా చూపించే నీచమైన ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ దివాలా తీయాల్సి వస్తే, ఆయన కుటుంబ సభ్యులు, సోదరులు తన మంత్రివర్గ సహచరులు చేస్తున్న అవినీతి, దోపిడి వల్ల, లూటీ వల్లనేని విమర్శించా రు. రేవంత్‌రెడ్డి కేవలం ఒక్క రాష్ట్ర రైతాంగానికే లక్ష 13 వేల కోట్ల రూపాయల కోట్లు ఎగగొట్టారని మండిపడ్డారు. రైతుబంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక సహాయం చేయకుండా మోసం చేశారని విమర్శించారు. 

కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని,  ప్రభుత్వం ఏం వెలగబెట్టిందని సంబరాలు చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులతో పాటు విద్యార్థులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు.. ఇలా ఎవరికీ ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు .. కానీ రాహుల్ గాంధీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానంటూ రేవంత్ చెబుతున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు. 

అర్ధరాత్రి పూజలెందుకో?

రేవంత్‌రెడ్డి మాటలు చూస్తుంటే ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని, ఆయనకు మానసిక జబ్బు ఉందేమో అన్న అనుమానం వస్తుందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని,  ప్రతి ఒక్కరి నీ కోటీశ్వరులను చేస్తానని,  సంపూర్ణంగా ధాన్యం కొనుగోలు చేస్తానని.. ఇలా రోజుకో మాట చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

డబ్బులు లేవంటూనే, 200 కోట్ల రూపాయలతో రాజభవనం నిర్మించుకుంటున్నారని, దానికి ఆయన సతీమణితో అర్ధరాత్రి పూజలు చేస్తున్నారని, ఎలాంటి తప్పు చేయకుంటే ఎందుకు అర్ధరాత్రి దొంగ చాటుగా పూజలు నిర్వహించారో చెప్పాలని ప్రశ్నించారు.  రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ప్రభుత్వానికి చెప్పే ఒక ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నదా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ పాలనలో ప్రతి రంగం అగ్రస్థానం వైపు పయనిస్తే రేవంత్‌రెడ్డి పాలనలో మాత్రం పాతాళానికి పడిపోతుందన్నారు.  రేవంత్ లిక్కర్ గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతున్నారని, నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉం మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌కు బాహుబలి సినిమాలో భల్లాల దేవునికి పట్టిన గతే పడుతుందని,  తాను నమ్మిన హిట్లర్‌కి ఎలాం టి ముగింపు కలిగిందో అలాంటి ముగింపే ప్రజలు ఇస్తారని కేటీఆర్ హెచ్చరించారు.