సరదా.. సరదాగా!
- కేటీఆర్‌కు చిన్నారుల గూగ్లీ ప్రశ్నలు
- ‘ది అండర్ 18 వరల్డ్’ షోలో నటుడు ప్రభాస్‌కు లైవ్ కాల్
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ఎప్పుడూ రాజకీయాలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలతో బిజీగా ఉండే కేటీఆర్‌లో కొత్త కోణం ఆవిష్కృతమైంది. ఆయన పాల్గొన్న ‘ది అండర్ 18 వరల్డ్’ అనే చిన్నారుల టాక్ షోకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షోలో చిన్నారులతో కేటీఆర్ ఎంతో సరదాగా ముచ్చటించారు. పిల్లలకు సం ధించిన కొన్ని గూగ్లీ ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పలేక నవ్వుతూ తల పట్టుకున్న సందర్భాలు ప్రేక్షకులను అలరించాయి.
ఇదే సమయంలో అనూహ్యంగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కేటీఆర్ లైవ్‌లోనే ఫోన్ చేయడం ప్రోమోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్క్రీన్ పై ప్రభాస్‌తో ఆయన మాట్లాడటం చూసి అక్కడున్న చిన్నారులతో పాటు సోషల్ మీడియా ప్రేక్షకులు కూడా సంతోషం, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ చిన్నారి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన కేటీఆర్ స్టేజ్‌పైనే పుష్-అప్స్ చేసి తన ఫిట్‌నెస్‌ను ప్రదర్శించుకోవడం విశేషం. అదే సమయంలో ఆయన సతీమణి కల్వకుంట్ల శైలిమ నుంచి ఫోన్ రావడంతో, షోలో ఉన్నాను.
తర్వాత మాట్లాడతా అంటూ చిరునవ్వుతో కాల్ ముగించడం ప్రోమోకు మరింత వినోదాన్ని జోడించింది. ఈ సన్నివేశంపై నెటిజన్లు సరదాగా స్పం దిస్తున్నారు. రాజకీయాల్లో ఎంత గంభీరంగా కనిపించే కేటీఆర్‌లోని మరో ఎంటర్‌టైనింగ్ కోణాన్ని ఈ షో ప్రేక్షకులకు పరిచయం చేసింది. పూర్తి ఇంటర్వ్యూ త్వరలో విడుదల కానుండటంతో రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ దీనిపై ఆసక్తి నెలకొంది.






