పాక్‌తో మాకేం పని
తిరగబడ్డ పీఓకే ప్రజలు
- తాము పాక్‌లో భాగం కాదని నినాదాలు
- స్థానికుల భారీ నిరసన
- నిత్యావసరాలు, ఆహార సరఫరాను దిగ్బంధించినా ఉద్యమం ఉధృతం
- అణచివేతలు కొనసాగితే భారత్ సహాయం కోరుతామని హెచ్చరికలు
ఇస్లామాబాద్, జూలై 1: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారీ నిరసనలతో అట్టుడుకుతోంది. ఆ ప్రాంతంలో స్థానికు ల ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతుండడంతో పాక్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నిత్యావసర, ఆహార సరఫరాలను దిగ్బంధించినా ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. మాపై అణచివేతలు కొనసాగిస్తే భారత్ సహాయం కోరుతామని స్థానికులు హెచ్చరించారు. పాకిస్థా న్‌లో పీఓకే భాగం కాదని నినాదాలు చేశారు.
పీవోకేలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓ సీ) సమీపంలో వేలాది మంది నిరసనకారులు మంగళవారం గుమిగూడి, ‘పీఓకే పాకిస్థాన్‌లో భాగం కాదు’ అని ప్రకటించారు. కశ్మీర్ పాకిస్థాన్ ఆస్తి కాదని నిన దించారు. ఆహార సరఫరాలపై ఆంక్షలు కొనసాగితే తాము ‘ఇతర మార్గాలను‘ వెతుక్కుంటామని, భారత్ సహాయం కోరతామని ఇస్లామాబాద్‌ను హెచ్చరించారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ప్రసార మాధ్యమాలను నిలువరించినా మా ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టంచేశారు.
రావల్‌కోట్‌లోని ఈద్గా మైదానంలో మంగళవారం జరిగిన ప్రదర్శన, ఆ ప్రాంతంపై పాకిస్థాన్ నియంత్రణకు ఇప్పటివరకు బలమైన నిరసనగా నిలిచింది. దశాబ్దాలుగా రాజకీయ నిర్లక్ష్యం, ఆర్థిక దోపిడీ, పరిపాలనాపరమైన అణచివేతకు పాల్పడుతున్నారని పాక్ ప్రభుత్వం, భద్రతా దళాలపై నిరసనకారులు మండిపడ్డారు. అంతేకాకుండా, ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు అధికారులు నిత్యావసర ఆహార సరఫరాలపై దిగ్బంధనం విధించారని వారు ఆరోపించారు.
పీఓకే పాకిస్తాన్‌కు చెందినది కాదని ప్రకటించారు. ‘మాకు పాకిస్థాన్ అవసరం లేదు. పైగా, పాకిస్తాన్‌కే పీఓకే అత్యవసరం’ అన్నారు. ఉద్యమాన్ని లొంగిపోయేలా చేయడానికి మేమంతా ఆకలితో అలమటించేలా పాక్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిరసనకారుల చప్పట్లతో, నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. జెండాలు ఊపుతూ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
ఇతర మార్గాలను అన్వేషిస్తాం
జూన్ 9 నుంచి నియంత్రణ రేఖ సమీపంలో నిరసనకారుల ఉద్యమం రోజురోజుకూ బలపడుతోంది. మహిళలు, పిల్లలు కాల్పుల విరమణ రేఖపై ఉన్న జీరో పాయిం ట్ వద్ద నిరసనగా కూర్చున్నారు. అయితే కశ్మీరీలకు ఆహార సరఫరాను నిలిపివేస్తామని పాక్ బెదిరిస్తోంది. అయినా ఉద్యమకారులు వెనక్కి తగ్గకుండా ‘మాకు మీ రేషన్లు అవసరం లేదు. మీకు మేమే కావాలి. మిగిలిన మార్గాలను కూడా తెరిచే పరిస్థితికి రానివ్వకండి.
అప్పుడు మమ్మల్ని ఇక్కడే ఉండమని మీరే బతిమాలుకోవలసి వస్తుంది. పరిస్థితిని చక్కదిద్దాలి’ అని పాక్ పాలకులకు హెచ్చరికలు చేశారు. ప్రభుత్వం బలప్రయోగంపై ఆధారపడకుండా ప్రజల ఆకాంక్షను గుర్తించాలని కోరారు. కశ్మీర్ పాకిస్థాన్‌లో భాగం కాదని, --కశ్మీర్ పాక్ ఆస్తి అంతకన్నా కాదని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలకు ఆహార ధాన్యాలు, పిండి, ఇతర నిత్యావసరాల రవాణాను పాక్ అధికారులు అడ్డుకోవడంతోనే తాజాగా ఆందోళన మొదలైంది.
ఈ ఉద్యమం ఇప్పుడు ద్రవ్యోల్బణం, విద్యుత్ ధరలు, పాలన, సబ్సిడీలు, నిరుద్యోగం.. దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ వివక్షకు నిరసనగా సాగుతోంది. తమ 38 -సూత్రాల డిమాండ్లను పాక్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకడి పరిస్థితి తెలియకుండా ప్రసార ఆంక్షలు విధించారని ఆగ్రహిస్తున్నారు.






