కాంగ్రెస్లోకి చేరికల జోరు
ఆరేకోడు నుంచి అధికార పార్టీలోకి బీఆర్‌ఎస్, సీపీఎం ముఖ్య నేతలు
కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి పొంగులేటి క్యాంపు ఇంచార్జి దయాకర్ రెడ్డి
ఖమ్మం రూరల్, జూలై 1 (విజయక్రాంతి): మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. బుధవారం ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోట వీరభద్రం ఆధ్వర్యంలో ఆరేకోడు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్, సీపీఎం పార్టీల ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సీపీఎం ముఖ్య నేత పేరెల్లి మధు, బీఆర్‌ఎస్ ముఖ్య నేత ఎనిగండ్ల రాంబాబు తమ అనుచరులతో కలిసి అధికార పార్టీ బాట పట్టారు. తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ప్రజా రంజక పాలన, నియోజకవర్గంలో జరుగుతున్న విస్తృత అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిలివేరు బాబు, గునిగంటి రమేష్, ఉప్పుగండ్ల ప్రసాద్, గునిగంటి సురేష్, కుసుమ రాజ, అరేంపుల రామారావు, మహిళా నాయకురాళ్లు గన్నోజు గోవిందమ్మ, అరేంపుల సునీత తదితరులు పాల్గొన్నారు.






