వడ్లు కొనుగోలు ప్రక్రియను మరింత వేగంగా కొనసాగించాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, మే 14 (విజయక్రాంతి): వడ్లు కొనుగోలు ప్రక్రియను మరింత వేగంగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై గురువారం సాయంత్రం తన ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలోని ఏ ఏ మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఎంతెంత వడ్లు తూకం చేసి మిల్లులకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాయి, ఈ రోజు ఎంత వడ్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చాయి, తూకం చేసి బస్తాల్లో నింపిన వడ్లు ఎన్ని క్వింటాళ్ళూ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో ఈరోజు మొత్తం 382 కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనుగోలు చేసి 6569 మెట్రిక్ టన్నుల వడ్లు తూకం చేయడం జరిగిందని సివిల్ సప్లై అధికారి వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు 69,428 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయడం పూర్తి అయిందని, అదేవిధంగా ఈ రోజు 195 లారీల్లోని వడ్లు ఆయా మిల్లుల వద్ద అన్లోడింగ్ చేసినట్లు లెక్కలు చూపించారు.
స్పందించిన కలెక్టర్ పెద్దమందడి, కొత్తకోట, మదనపూర్, పానగల్ ఐ కె.పి సెంటర్లలో తూకం చేసి బస్తాల్లో నింపిన ధాన్యం నిల్వలు అధికంగా ఉన్నాయని అదేవిధంగా పి. ఎ. సి.ఎస్ కు సంబంధించి కొత్తకోట, ఆత్మకూరు, ఘనపూర్, పెద్దమందడి, వనపర్తి, గోపాల్పేట మండలాల్లో నిల్వలు అధికంగా ఉన్నందున రేపు ఈ మండలాల్లో అత్యధికంగా కారులు పంపించాల్సిందిగా డి.యం. సివిల్ సప్లై, ట్రాన్స్పోర్ట్ అధికారులను ఆదేశించారు. హమాలీల కొరత రాకుండా చూసుకోవాలని మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. ప్రతిరోజు సమీక్ష ఉంటుందని, వడ్లు కొనుగోలులో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథ్, పి డి ఆర్ డి ఓ ఉమాదేవి, కోఆపరేటివ్ అధికారి తదితరులు పాల్గొన్నారు.






