ప్రతిపక్షాలకు ప్రాజెక్టులపై మాట్లాడే హక్కు లేదు
ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
వెల్దండ, జూన్ 1: ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు ప్రతిపక్ష పార్టీలకు లేదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు పెద్దాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు చేసి అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ఉత్తర తెలంగాణకు పెద్దపీట వేసి ఉమ్మడి జిల్లాలోని నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు నీతివాక్యాలు వల్లిస్తున్నారని వారు దుయ్యబట్టారు. మాజీ సీఎం కెసిఆర్ రెండు పడకల గదిలంటూ మాయమాటలు చేప్పి పదేళ్లల్లో ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు సొంతింటి కల నెరవేరుతుందని పేర్కొన్నారు. రెండో విడతలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని హామీనిచ్చారు. కేంద్రంలో ఉన్న బిజెపి తెలంగాణ పట్ల వివక్షత చూపుతూ నిధులు ఇవ్వడం లేదన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు హరికిషన్ నాయక్ సర్పంచులు యాదమ్మ, అనూష, రమేష్, నాయకులు భూపతి రెడ్డి, వెంకటేష్ గౌడ్, సంజీవ్ యాదవ్, కేసమ్మల కృష్ణ, రాజశేఖర్, పర్వత్ రెడ్డి, మోతిలాల్ నాయక్, విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.






