రేషన్ కార్డుల్లో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ పేరు పునరుద్ధరించాలి
గజ్వేల్, ఆగస్టు 27: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో జారీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై ‘ఆర్‌అండ్‌ఆర్ కాలనీ’ పేరును తొలగించి ‘ముట్రాజ్పల్లిసంగాపూర్’ పేర్లను ముద్రించడం శోచనీయమని లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి, 11వ వార్డు కౌన్సిలర్ భవాని కరుణాకర్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇళ్లు, భూములు, గ్రామాలను త్యాగం చేసి నిర్వాసితులుగా మారిన ప్రజలకు కనీస గుర్తింపు లేకుండా చేయడం తగదన్నారు. ఇప్పటికే పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలు, ఓపెన్ ప్లాట్లు, ఇతర హక్కులకు సంబంధించి నిర్వాసితులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 30 శాతం ఓటర్లుగా ఉన్న నిర్వాసిత కాలనీకి ప్రత్యేక గుర్తింపును తొలగించడం వారి హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై ‘ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపాడు, ఎర్రవల్లి, లక్ష్మా పూర్, బ్రాహ్మణ బంజర్పల్లి, సింగారం’ పేర్లతో చిరునామాను తక్షణమే సరిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే నిర్వాసితుల హక్కులు, కాలనీ ప్రత్యేక గుర్తింపు కోసం గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.






