28 August, 2026 | 1:23 AM

పేదల వైద్యం.. సర్కారు చోద్యం

28-08-2026 12:12 AM

ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరతతో ఇబ్బంది

భర్తీ కాని వైద్యులు, ఫార్మసిస్టులు

పెరుగుతున్న రోగుల సంఖ్య

సిద్దిపేట, ఆగస్టు 27 (విజయక్రాంతి)/ సిద్దిపేట క్రైం/ గజ్వేల్ / జగదేవపూర్ / కొండపాక/ నంగునూరు / కొమురవెల్లి / కోహెడ / బెజ్జెంకి: ’అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా ఉంది సిద్దిపేట జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల దుస్థితి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు వేగంగా ప్రబలుతున్న వేళ ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మందులు అందుబాటులో ఉన్నప్పటికీ సిబ్బంది కొరత సమస్యగా మారింది.

రోజురోజుకు పెరుగుతున్న రోగుల రద్దీకి అనుగుణంగా సిబ్బంది పూర్తి స్థాయిలో లేకపోవడంతో వైద్యం అందించడం సవాలుగా మారుతోంది. పలు ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సుల పోస్టులు భర్తీ కాకుండా ఉండడం విజయక్రాంతి విజిట్‌లో వెలుగులోకి వచ్చింది.

పట్టణాల్లోనూ అదే దుస్థితి

గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలోని ప్రధాన పట్టణ ఆసుపత్రుల్లోనూ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రులలో నిబంధనల ప్రకారం 120 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి. కానీ, అక్కడ కేవలం 39 మందే విధుల్లో ఉన్నారు. ఇటీవల 13 మంది బదిలీపై వెళ్లారు. దాంతో వైద్య సేవలుమరింత ఇబ్బందికరంగా మారాయి.

సిద్దిపేట పట్టణంలోని నాసర్ పురా అర్బన్ హెల్త్ సెంటర్ కు నిత్యం 70 మందికి పైగా రోగులు వస్తుండగా, ఇద్దరు నుంచి ముగ్గురు ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పోస్టుతోపాటు ఒక స్టాఫ్ నర్సు పోస్టు ఖాళీగా ఉంది. అంబేద్కర్ నగర్ యూహెచ్సీలో ఏకంగా రెండు నెలలు గడుస్తున్నామెడికల్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉండటం గమనార్హం. ఇక్కడ నిత్యం 80 మందికి పైగా రోగులు వస్తుండగా, ఎనిమిది మంది స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ విధులు నిర్వర్తిస్తూ పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.

అదనపు బాధ్యతలు.

జిల్లాలోని పలు పీహెచ్సీలలో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దాంతో ఉన్న సిబ్బందే అదనపు బాధ్యతలు మోస్తున్నారు. నంగునూరు మండలంలోని గట్లమల్యాల పీహెచ్సీలో ఫార్మసిస్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఒక స్టాఫ్ నర్సు, సూపర్ వైజర్ ఆ బాధ్యతలు చూస్తున్నారు. కొమురవెల్లి, చేర్యాల మండలంలోని ముస్త్యాల, కుకునూరుపల్లి, బెజ్జంకి మండలంలోని తోటపల్లి పీహెచ్సీలలో ఫార్మసిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బెజ్జంకి, తోటపల్లి పీహెచ్సీలలో ఒక్క స్టాఫ్ నర్సు కూడా అందుబాటులో లేరు. కొండపాకలో ముగ్గురు స్టాఫ్ నర్సులకు గాను ఒకరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. కొమురవెల్లిలో అటెండర్, మూడు ఏఎన్‌ఎం, రెండు ఎంఎల్హెచ్పీ పోస్టులు ఖాళీగా ఉండగా, శ్రీగిరిపల్లిలో ఇద్దరు ఎంఎల్హెచ్పీలు రాజీనామా చేసి వెళ్లారు.

పెరుగుతున్న యానిమల్ బైట్స్

గ్రామాల్లో వీధి కుక్కలు, కోతుల దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత పది రోజుల వ్యవధిలోనే ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితుల సంఖ్య దీనికి అద్దం పడుతోంది. కోహెడలో 11 కోతి కాట్లు, 8 కుక్క కాటు కేసులు నమోదు కాగా,బెజ్జంకిలో 12 కుక్క కాట్లు, 6 కోతుల దాడుల కేసులు నమోదయ్యాయి.

కొమురవెల్లిలో 12 మంది కోతుల వల్ల గాయపడగా, నలుగురు కుక్కకాటుకు గురయ్యారు. కొండపాకలో రోజూ సగటున ఒకటి నుంచి మూడు కుక్కకాటు కేసులు వస్తున్నాయి. సిద్దిపేట నాసర్ పురా ఆసుపత్రిలోనూ రెండు కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు పలుచోట్ల తేలు, పాము కాటు కేసులు వస్తున్నాయి. కొమురవెల్లి తదితర కేంద్రాల్లో పాముకాటుకు ప్రాథమిక చికిత్స మాత్రమే అందించి మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు.

మందుల పంపిణీకీ కష్టాలు

సిద్దిపేట జిల్లాలోని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలన్నింటిలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు సరిపడా అందుబాటులో ఉన్నాయి. అన్ని కేంద్రాల్లోనూ యాంటీ రేబీస్ (కుక్కకాటు),యాంటీ వీనమ్ (పాముకాటు) మందులు సిద్ధంగా ఉంచారు.

రాజగోపాల్పేట, గట్లమల్యాల తదితర పీహెచ్సీలలో ఓపీ సంఖ్య 90 దాటుతున్నా ఉన్న మందులతోనే వైద్యులు నెట్టుకొస్తున్నారు. కానీ, ఆ మందులను సరైన సమయంలో రోగులకు అందించేందుకు అవసరమైన పూర్తిస్థాయి వైద్యులు, ఫార్మసిస్టులు లేకపోవడమే అసలు సమస్యగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, తద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.