calender_icon.png 8 February, 2026 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యారెంటీల గారడీ

08-02-2026 01:33:32 AM

ఆలోచించండి.. ఆగం కాకండి!

కాంగ్రెసోళ్లు ప్రజలకు చెయ్యిచ్చారు.. బీజేపోళ్లు చెవిలో పువ్వుపెట్టారు

  1. ఆ రెండు పార్టీలను ఎదుర్కోవాలి.. ధైర్యంగా నిలబడాలి 
  2. ఎమ్మెల్యే పోచారం కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరారు 
  3. కామారెడ్డి జిల్లా రోడ్ షోలలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కామారెడ్డి/బాన్సువాడ/బిచ్కుంద/ఎల్లారెడ్డి (ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ‘ఆలోచించండి.. ఆగమాగం కాకండి.. కాంగ్రె సోళ్లు దొంగలు.. దండుపాళ్యం ముఠా సభ్యులు అని ప్రజలు గమనించాలి. గ్యారెంటీలంటూ కాంగ్రెసోళ్లు గారడీ చేస్తున్నారు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేయిచ్చారని, బీజేపీ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టారని, గరీబోళ్లకు మాత్రం బీఆర్‌ఎస్ న్యాయం చేసిందని.. అందుకే కారు గుర్తుకే ఓటేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

ఆ రెండు పార్టీలను ఎదుర్కోవాలి, ధైర్యంగా నిలబడాలి అని చెప్పారు. ఢిల్లీలో రాహుల్ బాబా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చౌకీదారు అంటుంటే.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నరేంద్ర మోదీకి బడే భాయ్ అంటూ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే రైతు భరోసాను పదివేల నుంచి రూ.15,000 పెంచి రైతులకు ఇస్తానని మోసం చేసిందని ఆయన ఆరోపించారు.

అంతేకాకుండా ఆరు గ్యారెంటీలు 420 హామీలు 2,000 నుంచి 4 వేలకు పింఛను ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, మహిళలకు రూ. 2,500 పింఛన్, ఇంటర్ విద్యార్థినులకు స్కూటీలు వంటి అనేక హామీలు తుంగలో తొక్కి కేవలం బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా రేవంత్‌రెడ్డి దండుపాళ్యం ముఠా సభ్యులు రాష్ట్రంలో పని చేస్తున్నారన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పరిధిలో శనివా రం నిర్వహించిన బీఆర్‌ఎస్ రోడ్ షోలలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉందని, యూరియా కొరతతో రైతులను ఇబ్బందుల గురిచేస్తుందని అన్నారు. రూ. 4,000 పింఛన్ తీసుకున్న వాళ్లు కాంగ్రెస్‌కు ఓటు వేయండి అని 2,000 పింఛన్ తీసుకున్నవాళ్లు బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని ఆయన తెలిపారు.

మార్పు కోరుకొని కాంగ్రెస్ వాళ్లకు ఓట్లు వేసి మోసపోయారన్నారు. బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, నియోజకవవర్గాలలో పదివేల డబుల్ బెడ్ రూమ్ ఇచ్చింది కేసీఆర్ అని చెప్పారు. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కొరకు పదివేల కోట్లు నిధులు మంజూరుచేసి, అభివృద్ధి చేపట్టింది నిజం కాదా అని ప్రజలను ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ పాలన మోసాలను ప్రజలు గమనించి ఓటు వేయాలని కేటీఆర్ చెప్పారు.

ప్రజాపాలన అంటూ ప్రజలను మోసంచేసి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చూస్తున్నదని, కాంగ్రెస్ పార్టీని బొందపెట్టి కారు గుర్తుకే ఓటువేయాలని పిలుపునిచ్చారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారని, ఆయన తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలన్నారు. ప్రజలు ఇచ్చే తీర్పును స్వీకరించాలని సవాలు విసిరారు.

బాన్సువాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. 6 గ్యారంటీలను ప్రశ్నిస్తే సీఎం రేవంత్‌రెడ్డి బూతులు తిడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పండుగ తోఫాలు మాయమయ్యాయని, సంక్షేమ పథకాలన్నీ బందు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రోడ్ షోలలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దు

ఎల్లారెడ్డి(విజయక్రాంతి): రాష్ట్రం లో అభివృద్ధి అంటే మాజీ సీఎం కేసీఆర్ అని తెలంగాణ అంటే కేసీఆర్ అని ప్రజల గుండెల్లో చిరస్మ రణీయమని కేటీఆర్ అన్నారు. కాం గ్రెస్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దని ఓటర్లతో అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మె ల్యే మదన్‌మోహన్ చేసిందేమీ లేద ని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సుమారు రూ.200 కోట్ల నిధులతో అభివృద్ధి చేసిందన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణం అభివృద్ధి చెందాలంటే ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణంలో బరిలో ఉన్న 12 మంది అభ్యర్థులకు తప్పకుండా పార్టీ గుర్తు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, జనార్దన్‌గౌడ్, స్టార్ క్యాంపెయినర్ మనోహర్‌రెడ్డి, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు ప్రతాపరెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు ఏగుల నరసింహులు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ పాల్గొన్నారు.